Advertisement
పెళ్లిళ్లంటే.. అబ్బో.. మన దేశంలో ఆ సందడే వేరేగా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా వివాహాలు చేసుకుంటారు. కానీ కోవిడ్ కారణంగా ఆ అట్టహాసం పోయింది. వధువు, వరుడు ఇరు పక్షాల నుంచి కేవలం తక్కువ సంఖ్యలో అతిథులతోనే ప్రస్తుతం వివాహాలు జరిపిస్తున్నారు. అయితే తమిళనాడు, కేరళ సరిహద్దులోని ఆ గ్రామం వద్ద వివాహాలు వినూత్న రీతిలో జరుగుతున్నాయి.
తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న మరయూర్ అనే గ్రామానికి చెందిన వారు గతంలో అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకునేవారు. కానీ కోవిడ్ కారణంగా అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ గ్రామానికి చెందిన వారు తమిళనాడు లేదా కేరళకు చెందిన వారిని వివాహం చేసుకోదలిస్తే ప్రస్తుతం రెండు రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో వధువు, వరుడు ఇద్దరి తరఫు నుంచి ఒక్కో వైపు 5 మందికి మించకుండా.. మొత్తం 10 మంది అతిథులతోనే వివాహాలు చేసుకుంటున్నారు. అది కూడా ఏ ఫంక్షన్ హాల్‌లోనో, ఆలయంలోనో.. ఇతర మత సంబంధమైన ప్రదేశంలోనో.. అనుకుంటే.. పొరపాటు.. నడిరోడ్డుపై వారు వివాహాలు చేసుకుంటున్నారు.
Advertisement
అక్కడి చిన్నార్ అనే సరిహద్దు ప్రాంతం వద్ద ఇటీవలే మరయూర్ గ్రామానికి చెందిన వధువుకు, తమిళనాడుకు చెందిన వరుడికి వివాహం అయింది. నూతన వధూవరులు కేవలం పూలమాలలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఇరువైపులా మొత్తం కలిపి 6 మంది వరకే ఆ పెళ్లికి అతిథులు హాజరయ్యారు. ఇక వరుడు తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుంటే.. వధువు కేరళ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను తెచ్చింది. ఇద్దరూ ఆయా పత్రాలను సరిహద్దు వద్ద పోలీసు అధికారులకు చూపించారు. దీంతో నూతన జంట సరిహద్దు వద్దే పెళ్లి చేసుకుంది. మొత్తం వివాహం తంతు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ముగిసింది. అందువల్ల ట్రాఫిక్‌కు కూడా ఏం ఇబ్బంది కాలేదని పోలీసు అధికారులు తెలిపారు.
Advertisements
అయితే ఇదే కాదు.. గత నెల రోజుల నుంచి ఇదే సరిహద్దు వద్ద అచ్చం ఇలాగే 5 వరకు పెళ్లిళ్లు జరిగాయి. సరిహద్దు వద్ద అటు నుంచి, ఇటు నుంచి వధువు, వరుడితోపాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం కలిపి 10 మంది వరకు వచ్చి రోడ్డుపైనే జంటలకు పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఇది అక్కడ ప్రస్తుతం ఓ కొత్త తరహా వివాహ పద్ధతి అయిందని పలువురు అంటున్నారు. అయితే కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గాక కూడా ఇలాగే వివాహాలు చేస్తారా, లేదా పాత పద్ధతిలో భారీ ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు జరిపిస్తారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
Advertisements