Advertisement
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పలు చోట్ల ప్రధాని మోదీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ల పోస్టర్లు వెలిశాయి. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత సర్దార్ అయాజ్ సిద్దికి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పోస్టర్లను ఆయన నియోజకవర్గమైన లాహోర్‌లో పలు చోట్ల ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, అభినందన్ వర్ధమాన్, అయాజ్.. ముగ్గురితో కలిపి ఆ పోస్టర్లను ఏర్పాటు చేయడం గమనార్హం. వాటిల్లో అయాజ్ ఫొటోను అభినందన్ వర్దమాన్ లా మార్ఫింగ్ కూడా చేశారు.
పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ దాడులు చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగా భారత్ ఫిబ్రవరి 26, 2019న బాలాకోట్‌లోని ఖైబర్ పఖ్‌తున్‌ఖ్వాలో ఉన్న సదరు ఉగ్రవాద సంస్థ శిబిరాలపై వైమానిక దాడి చేపట్టింది. అందులో వందల మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ దాడుల్లో అభినందన్ వర్ధమాన్ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతను పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 జెట్‌ను కూల్చివేశాడు. అయితే తన జెట్‌లో సాంకేతిక సమస్య రావడంతో పాకిస్థాన్ ప్రాంతంలో అతను ల్యాండ్ అయ్యాడు. తరువాత అక్కడి సైనికులు అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారత్ విజ్ఞప్తి మేరకు వారు అతన్ని విడిచిపెట్టారు.
Advertisement
Advertisements
అయితే అభినందన్‌ను అదుపులోకి తీసుకున్న రోజు రాత్రి అతన్ని విడిచిపెట్టకపోయి ఉంటే భారత్ ఆ రోజు పాక్‌పై దాడి చేసి ఉండేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ కురేషీ అన్నారని.. అయాజ్ పేర్కొన్నారు. కురేషీ అలా అనే సరికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా కాళ్లు వణికాయని.. అయాజ్ అన్నారు. అయితే అయాజ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో దుమారం చెలరేగింది. అతను దేశద్రోహి అంటూ పాక్ ప్రజలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే అతని నియోజకవర్గంలో పలు చోట్ల మోదీ, అభినందన్‌తోపాటు అతని పోస్టర్లను కూడా వారితో కలిపి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అయాజ్ పై ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
Advertisements