Advertisement
అరేంజ్ మారేజెస్ లో చాలా వరకు ప్రేమ ఉండదు..ఏదో సర్దుకుపోతుంటారు అని అంటుంటారు..కానీ నిజానికి ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో తెలియదు..కానీ ఒకసారి పుట్టిందంటే మన కట్టెకాలే వరకు, మనం పోయాక కూడా మనల్ని ప్రేమించిన వారి నవ్వులో మన ప్రేమ జీవించే ఉంటుంది..అందుకు ఉదాహారణ ఈ కథే..
కాలేజ్ ముఖం చూడని అమ్మాయి…వ్యాపారంలో ముందున్న అబ్బాయి.. ఇద్దరికి సరిజోడి అని పెద్దలు పెళ్లి కుదిర్చారు..పెళ్లంటేనే ఇష్టంలేని అబ్బాయి తనని చూడగానే ఆ నిర్ణయం మార్చుకున్నాడు.. పెళ్లిమండపంలో తొలిచూపులోనే తనతో ప్రేమలో పడ్డాడు..తన తల్లిదండ్రి తనకు ఏదైనా మంచే చేస్తారనే నమ్మకం ఆ అమ్మాయిది..
పెళ్లయి అత్తింట్లో అడుగుపెట్టింది..ఉమ్మడి కుటుంబం.. కొత్త ప్రపంచంలో అందరితో కలిసిపోవడానికి ప్రయత్నించింది..మంచి కోడలు అనిపించుకోవడానికి తను చేయని ప్రయత్నం అంటూ లేదు.. నెలతప్పింది..అపురూపంగా చూసుకున్నారు.. తొమ్మిది నెలలు నిండి ఒక బిడ్డ పుట్టాక అంతా తలకిందులైంది.. తన తప్పేం లేకపోయినా అత్తగారు చీటికి మాటికి తిట్టేవారు..తను చేసిన అతి పెద్ద తప్పు తన కడుపున “ఆడపిల్ల” పుట్టడం..
తన భార్యని అవమానించడం ఆ భర్త భరించలేకపోయేవాడు..కానీ తనని ఎలా ఓదార్చాలో అర్దమయ్యేది కాదు..ఒకరోజు తనని,బిడ్డని తీసుకుని ఆ ఇంటి నుండి దూరంగా వచ్చేశాడు.. మళ్లీ మొదటి నుండి జీవితం మొదలు పెట్టాలి…భార్య బిడ్డల కడుపు నింపడం కోసం తన చేతికున్న ఉంగరం అమ్మేశాడు, చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు.. చివరికి బిజినెస్ మొదలు పెట్టాడు..అతడి ప్రతి పనిలో తను తోడు నిలబడింది..వారికి మళ్లీ ఒక ఆడపిల్ల పుట్టింది..ఇద్దరు బిడ్డలతో సంతోషంగా గడపసాగారు..
Advertisements
Advertisement
ప్రతి యానివర్సరీకి తనకి ఒక రింగ్ బహుమానంగా ఇవ్వడం ఆ భర్తకి అలవాటు.. ఏడవ పెళ్ళిరోజుకి రింగ్ తో పాటు ఫ్లైట్ టికెట్స్ కూడా బహుమానంగా ఇచ్చాడు..తన పుట్టింటికి వెళ్లడానికి.. పెళ్లయిన తర్వాత తొలిసారి పుట్టింటికి వెళ్లబోతుంది..భర్తని కూడా రమ్మంది.కానీ కుదరదన్నాడు..పిల్లల్ని తీసుకుని వెళ్లింది.. అక్కడికి వెళ్లగానే భర్తకి కాల్ చేసింది..తనని కూడా రమ్మని చెప్దామని..
కానీ డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేశారు..తను మాట్లాడే పరిస్థితిలో లేడు అని చెప్పడంతో..లేదు నేను ఇప్పుడు తన గొంతు వినాలి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని రెట్టించి అడిగింది..సారీ, అతను చనిపోయాడు అని అవతల వైపు మాట వినిపించగానే ఒక్క క్షణం భూమి కంపించినట్టైంది..ఇద్దరి పిల్లల్ని తీసుకుని రిటర్న్ బయల్దేరింది..
అతను చనిపోయినప్పుడు తన వయసు 30ఏళ్లు.. ఇద్దరు పిల్లలతో జీవితం గడపసాగింది..రెండవ పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు..ఎప్పటికి చేసుకోదు కూడా..ఎందుకంటే తను అతన్ని ప్రేమిస్తుంది.తన ప్రాణం కంటే ఎక్కువగా.. అందుకే అతను కోరుకున్నట్టుగా ఇద్దరు ఆడపిల్లల్నిపెద్ద చదువులు చదివించాలనుకుంది..చదివిస్తుంది.అతడు ప్రతి యానివర్సరికి ఇచ్చిన రింగ్స్ ని ఎన్ని కష్టాలొచ్చినా దూరం చేసుకోలేదు..అతడు కొన్న ప్రతి చీరని తనతోనే ఉంచుకుంది..వాటిని కట్టుకున్నప్పుడు ఆమె ముఖం ఒక రకమైన వెలుగుతో ప్రకాశించేది..ఆమె ఎవరో కాదు మా అమ్మ!
Advertisements