Advertisement
పెళ్లి చేస్కోవడం ద్వారా తండ్రి కష్టం అయితే తీర్చగలిగింది కానీ అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి పదిహేడేళ్ల నిషాకి..పెళ్లినాటికి తన భర్త సార్ధక్ వయసూ 20ఏళ్లే…పెళ్లయిన రెండు నెలలకే నెలతప్పింది…. మగబిడ్డ కోసం ఎదురు చూసారు అత్తింటివారు….పద్దెనిమిదేళ్లకే తొలికాన్పు.. ఆడపిల్ల పుట్టింది.. ఆడపిల్ల పుట్టిందనే సరికి ఆ ఇంటి వాతావరణం మారిపోయింది..
కంపెనిలో చేసే పనికి వచ్చే జీతం సార్ధక్ తాగుడుకే సగం పోయేది..బిడ్డకి కడుపు నిండా తిండిపెట్టలేకపోయేది నిషా..అదే విషయం భర్తతో చెప్తే నీకే తిండి దండగ,ఇప్పుడు దానికి కూడానా అంటూ గొడ్డుని బాదినట్టు బాదేవాడు.. బిడ్డ కడుపు నింపడంకోసం, సార్ధక్ కి చేదోడు వాదోడుగా ఉంటుందని ఏదైనా చిన్నపనిలో చేరదామనుకుంది నిషా..అక్కడా నిరాశే ఎదురయింది..
కోడలిని పనికి బయటకి పంపిస్తే ఎవరితో అయినా సంబంధం పెట్టుకుంటుందనే అనుమానం నిషా అత్తది.. ఇంటికి కావలసిన సరుకులకు షాప్ కి వెళ్తేనే ఇంటికి వచ్చాక రకరకాల ప్రశ్నలడిగేది..తాను కోడలిని కష్టపెట్టిందే చాలక సార్ధక్ కి చెప్పి కొట్టించేది.. దెబ్బలు మాత్రమేనా.. తనకి ఎవరితో అయినా పడుకుందా అనే అనుమానంతో… నిషా బాడీ చెక్ చేసేవాడు..తర్వాత మళ్లీ పశువులా తనమీద పడి కోరిక తీర్చుకునేవాడు..
Advertisement
Advertisements
Advertisements
అయిదేళ్లు గడిచిపోయాయి..ముగ్గురు ఆడపిల్లల తల్లయింది.. నిషాకి ఇష్టం లేకపోయినా సరే కొడుకు కోసం ప్రతి రాత్రి నిషాని హింసించేవాడు సార్దక్..కొడుకే కావాలని రకరకాల మంత్రగాళ్ల దగ్గరకు కూడా తిప్పారు.. చివరికి నాలుగోసారి ప్రెగ్నెంట్ అయింది నిషా..ఈ సారి ఖచ్చితంగా కొడుకే పుడతాడని, పుట్టాలని సార్ధక్ కోరుకున్నాడు..నిషా వారికంటే ఎక్కువగా కోరుకుంది కొడుకు పుట్టాలని.. కనీసం తనకి ఈ నరకం అయినా తప్పుతుంది అని…
కానీ వరుస కాన్పులు,తనకి ఇష్టం లేకుండా శృంగారం..ఇంటిపని.. మానసిక ఒత్తిడి..వెరసి నిషా శరీరం తట్టుకోలేకపోయింది..కాన్పు సమయంలో బిడ్డతో సహా నిషా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది..తల్లి దూరం అయి అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులు అనాధలయ్యారు.. నిషాకి నాలుగో కాన్పులో కూడా ఆడపిల్లే..తల్లితోపాటే వెళ్లిపోయి మంచిపని చేసింది..మనదేశంలో నిత్యం ఎంతో మంది నిషాలు ఇలాగే బలి అవుతున్నారు! పైసాకి పనికి రానివాడికి కూడా వాడి వంశాన్ని నిలబెట్టే వారసుడు కావాలి.. మీరే చెప్పండి నిషాది సహజమరణమా? హత్యా??