Advertisement
సమాజంలోని అందరికీ ఉచితంగా విద్య లభించాలి. విద్య వల్ల మనిషికి జ్ఞానం పెరుగుతుంది. ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతాడు. తద్వారా దేశం కూడా అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది. అయితే ఇప్పటికీ దేశంలో చాలా మంది ఇంకా నిరక్షరాస్యులుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి కొందరికైనా తన వంతుగా చదువు చెప్పాలనే ఉద్దేశంతో అతను ఏకంగా 75 ఏళ్ల నుంచి ఉచితంగా చదువు చెబుతున్నాడు. అతనే ఒడిశాకు చెందిన నంద ప్రాస్తి.
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా బర్తండా గ్రామానికి చెందిన నంద ప్రాస్తి గత 75 సంవత్సరాలుగా పేద పిల్లలకు తన ఇంటి వద్ద ఉన్న ఓ భారీ వృక్షం కింద ఉచితంగా చదువు చెబుతున్నాడు. పగటి పూట పిల్లలకు, రాత్రి పూట గ్రామంలోని పెద్దలకు అతను ఉచితంగా చదువు చెబుతున్నాడు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ఎవరూ నిరక్షరాస్యులుగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే అతను అందరికీ ఉచితంగా చదువు చెబుతున్నాడు. గతంలో తన వద్ద చదువుకున్న వారికి చెందిన మనవలు, మనవరాళ్లకు కూడా ఇప్పుడతను పాఠాలు బోధిస్తున్నాడు. మనిషికి విద్య తప్పనిసరి అనే విషయాన్ని చాటి చెబుతున్నాడు. అలా 75 ఏళ్లుగా ఆయన సేవ అందిస్తున్నాడు.
Advertisement
Advertisements
అయితే ఆయన చేస్తున్న సేవకు ఆ గ్రామ సర్పంచ్ ప్రభుత్వం తరఫున సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయినప్పటికీ దాన్ని నంద ప్రాస్తి తిరస్కరించాడు. అలా అనేక సార్లు అడిగినా అన్ని సార్లూ సహాయాన్ని తిరస్కరించాడు. అయితే ఆయన చెట్టు కింద పాఠాలు చెబుతున్నందున కనీసం అందుకోసం ఓ పాఠశాల భవనాన్ని అయినా ప్రభుత్వ సహాయంచే నిర్మింపజేయాలని ఆ గ్రామ సర్పంచ్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ చెట్టు కింద ఎండ వచ్చినా, వాన పడినా, చలిలో అయినా సరే నంద ప్రాస్తి పాఠాలు చెబుతున్నాడు తప్ప మానడం లేదు. కనుక ఆయనకు, పిల్లలకు, ఇతర చదువుకునే వారికి రక్షణ కోసం ఓ భవనాన్ని నిర్మించాలని చూస్తున్నారు.
Advertisements
కాగా నందప్రాస్తి గతంలో టీచర్‌గా పనిచేశాడు. రిటైర్ అయ్యాక ఇప్పుడిలా పాఠాలు చెబుతున్నాడు. అయినప్పటీకీ ప్రాణం ఉన్నంత వరకు ఇలా పాఠాలు చెబుతూనే ఉంటానని తెలిపాడు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న సేవకు ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు.