Advertisement
ప్రపంచ వ్యాప్తంగా శివుడికి అనేక ఆలయాలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక దేశాల్లో శివాలయాలు ఇప్పటికీ తవ్వకాల్లో బయట పడుతూనే ఉన్నాయి. ఇక మన దేశంలో 12 ముఖ్యమైన క్షేత్రాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉండడంతోపాటు అనేక చోట్ల ఇతర శివాలయాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఉన్న శివలింగాలు అత్యంత ప్రాముఖ్యతను గాంచాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శివలింగంగా భావించబడుతున్న ఓ ప్రత్యేకమైన శివలింగం కూడా ఉంది. అదెక్కడ ఉందంటే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పుణ్య క్షేత్రానికి సమీపంలో గుడిమల్లం అనే ప్రాంతం ఉంది. రేణిగుంట నుంచి ఇక్కడికి సుమారుగా 10 కిలోమీటర్లు ఉంటుంది. అదే తిరుపతి నుంచి అయితే 20 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న శివాలయంలో భిన్న ఆకృతిలో ఉండే శివలింగం మనకు కనిపిస్తుంది. లింగంమీద పరమశివుడి బొమ్మ చెక్కబడి ఉంటుంది.
Advertisement
Advertisements
ఇక ఆ శివలింగం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైందిగా భావిస్తున్నారు. ఆ లింగం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినదిగా చెబుతారు. కొందరు క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఆ లింగాన్ని చెక్కి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ శివలింగం ఆకృతిలో ఇతర లింగాల కన్నా భిన్నంగా మనకు కనిపిస్తూ ప్రత్యేకతను సంతరించుకుంది.
Advertisements
అయితే ఇలాంటి శివలింగాలు ప్రపంచంలో మరో రెండు ఉన్నాయి. ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని మధుర మ్యూజియంలో ఉంది. దాన్ని భీత లింగం అని అంటారు. ఇక మధురలోనే ఉండే మరొక లింగాన్ని అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉన్న మ్యూజియంకు తరలించారు. అయితే అక్కడికి ఆ లింగం ఎలా వెళ్లిందో తెలియదు. కానీ ప్రస్తుతం మొత్తం ఆ 3 శివలింగాలను అత్యంత పురాతనమైనవిగా భావిస్తున్నారు.