Advertisement
పార్లె-జి బిస్కెట్లను చూడగానే ఎవరికైనా సరే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. చిన్నతనంలో చాలా మంది ఈ బిస్కెట్లను ఉదయం లేవగానే వేడి వేడి టీలో ముంచుకుని తినే ఉంటారు. దేశవ్యాప్తంగా అనేక మందికి ఈ బిస్కెట్లతో ఎనలేని అనుబంధం ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో మనకు అనేక బిస్కెట్లు అందుబాటులో ఉన్నా.. ఇప్పటికీ పార్లె-జి బిస్కెట్లకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. జనాలు అంతలా వీటిని ఆదరిస్తున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అసలు పార్లె-జి బిస్కెట్ల ప్రస్థానం ఎలా మొదలైందంటే…
అది 1929వ సంవత్సరం. మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజులు. అప్పట్లో స్వదేశీ వస్తువులను వాడాలనే ఉద్యమం జోరుగా కొనసాగుతోంది. అదే సమయంలో బ్రిటిష్ వారికి చెందిన యునైటెడ్ బిస్కెట్లు, హంట్లీ పామర్స్, బ్రిటానియా, గ్లాక్సో కంపెనీల బిస్కెట్లు దేశంలో డామినేట్ చేస్తున్నాయి. దీంతో మనకంటూ ఒక సొంత బ్రాండ్ ఉండాలని చెప్పి ముంబైకి చెందిన సిల్క్ వ్యాపారి మోహన్‌లాల్ దయాల్ జర్మనీకి వెళ్లి అక్కడ బేకరీ ఐటమ్స్ తయారు చేసే మెళకువలను, ఆపరేట్ చేసే యంత్రాల పనితీరును నేర్చుకుని వచ్చారు. ఆయన వస్తూ వస్తూ అక్కడి నుంచి రూ.60వేలు ఖర్చు పెట్టి బేకరీ యంత్రాలను ఇండియాకు తెచ్చారు.
అలా మోహన్‌లాల్ ఇండియాకు వచ్చాక.. 1929లో ముంబైలోని ఇర్లా అండ్ పార్లా అనే ప్రాంతంలో చిన్నగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అందులో మొదట్లో కేవలం 12 మంది పనిచేసేవారు. అది కూడా మోహన్‌లాల్ కుటుంబ సభ్యులే కావడం విశేషం. వారు అప్పట్లో తమ ఫ్యాక్టరీకి పేరు కూడా పెట్టలేదు. మొదట్లో వారు ఆరెంజ్ క్యాండీ, టాఫీలను తయారు చేసేవారు. తరువాత 10 ఏళ్లకు బిస్కెట్లను తయారు చేయడం ప్రారంభించారు. దీంతో ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం పార్లా పేరిటే ఆ కంపెనీకి పార్లె అని పేరు పెట్టారు. అలా స్వదేశీ ఉద్యమంలో భాగంగా పార్లె కంపెనీ ఏర్పాటై బిస్కెట్లను తయారు చేయడం ప్రారంభించింది.
Advertisements
1939 సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా.. ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలోనూ పార్లె కంపెనీ పార్లె గ్లూకో పేరిట బిస్కెట్లను తయారు చేసి విక్రయించింది. అప్పట్లో మార్కెట్లో బిస్కెట్లను తయారు చేసేవన్నీ బ్రిటిష్ వారికి చెందిన కంపెనీలే. పార్లె ఒక్కటే మన దేశానికి చెందినది. దీంతోపాటు బిస్కెట్లు చాలా తక్కువ ఖరీదు కలిగి ఉండేవి. ఈ క్రమంలో పార్లె బిస్కెట్లకు తక్కువ కాలంలోనే ఆదరణ పెరిగింది. స్వదేశీ ఉద్యమం నడుస్తున్నందున విదేశీ బిస్కెట్లను తినడం మాని జనాలు పార్లె బిస్కెట్లను తినడం మొదలు పెట్టారు. ఇది కూడా పార్లె సక్సెస్‌కు ఓ కారణం. అందువల్లే పార్లెతో జనాలకు అంతటి అనుబంధం ఏర్పడింది.
Advertisement
అయితే స్వాతంత్య్రం అనంతరం భారత్, పాక్‌లు విడిపోయాక మన దేశంలో గోధుమలు ఉత్పత్తి అయ్యే విస్తీర్ణం బాగా తగ్గి 63 శాతానికి చేరుకుంది. దీంతో అది బిస్కెట్ల తయారీపై ప్రభావం చూపించింది. తరువాత కొంత కాలం వరకు పార్లె బిస్కెట్లు మార్కెట్‌లోకి రాలేదు. అయినా మళ్లీ గోధుమల పంట ఎక్కువగా చేతికి అందడంతో పార్లె మళ్లీ గ్లూకో బిస్కెట్ల తయారీని ప్రారంభించింది.
అయితే 1960లలో బ్రిటానియా కంపెనీ గ్లూకోస్ డి పేరిట పార్లె గ్గూకో బిస్కెట్లను అనుకరిస్తూ బిస్కెట్లను మార్కెట్‌లోకి తెచ్చింది. దీంతో జనాలు పార్లె, బ్రిటానియా బిస్కెట్లకు తేడా కనుక్కోలేకపోయారు. మరోవైపు గ్లూకోస్ డి బిస్కెట్లకు అప్పట్లో షోలే గబ్బర్‌సింగ్ పాత్రధారి అంజద్ ఖాన్ ప్రచారం చేశారు. దీంతో గ్లూకోస్ డి బిస్కెట్లను జనాలు ఎక్కువగా కొనడం మొదలు పెట్టారు. అయితే పార్లె జి దాన్ని పూర్తిగా తిప్పికొట్టింది. తన లోగోను ఎరుపు రంగులోకి మార్చింది. అలాగే బిస్కెట్లను చాలా తక్కువ ఖరీదు కలిగిన ఎల్లో కలర్ ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి అందించడం మొదలు పెట్టింది. అలాగే పార్లె గ్లూకో కాకుండా.. పార్లె-జి గా బిస్కెట్లకు పేరు మార్పు చేసి అమ్మడం మొదలు పెట్టింది. జి అంటే గ్లూకోస్ అని యాడ్స్ ద్వారా ఆకట్టుకునే విధంగా ప్రచారం చేసింది. దీంతో మళ్లీ పార్లె బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయి. అలా పార్లె గ్లూకో బిస్కెట్లు పార్లె-జిగా మారి ఇప్పటికీ అదే పేరిట అమ్ముడవుతున్నాయి. అప్పటి నుంచి ఇక పార్లె-జి వెనుదిరిగి చూడలేదు.
పార్లె-జి ఎప్పటికప్పుడు వినూత్నమైన పద్ధతిలో ఇచ్చే యాడ్స్ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో పార్లె-జి ఒక స్వచ్ఛమైన స్వదేశీ బ్రాండ్‌గా అవతరించింది. దేశంలోని మారుమూల గ్రామాల్లోనూ పార్లె-జి బిస్కెట్లు మనకు దొరుకుతాయి.. అంటే ఆ బిస్కెట్లకు దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తక్కువ ధర, నాణ్యత ఉండడమే పార్లె-జి బిస్కెట్ల సక్సెస్‌కు కారణం అయింది. అలాగే వాటితో జనాలకు అనుబంధం కూడా పెరిగింది.
ఇక పార్లె ప్రస్తుతం నెలకు కొన్ని వందల కోట్ల బిస్కెట్లను ప్యాక్ చేసి అమ్ముతుంది. ఏటా 14,600 కోట్ల వరకు బిస్కెట్లను పార్లె ఉత్పత్తి చేస్తుంది. వాటిని దేశంలో ఉన్న జనాలు అందరికీ పంచితే మనిషికి 121 బిస్కెట్లు వస్తాయి. పార్లె జి బిస్కెట్లతో పలు రెస్టారెంట్లు పలు డిజర్ట్‌లను కూడా చేసి భోజన ప్రియులకు ఇస్తున్నాయి. ఫర్జి కేఫ్ పార్లె జి బిస్కెట్లతో పార్లె జి చీజ్‌కేక్ తయారు చేసి అమ్ముతుంది. ముంబైలోని 145 రెస్టారెంట్ పార్లె జి ఈట్‌షేక్‌ను తయారు చేసి ఇస్తుంది.
ఇక దేశంలోని ఎల్‌వోసీ వద్ద ఉన్న మారుమూల గ్రామాల్లోనూ మనకు పార్లె జి బిస్కెట్లు లభిస్తాయి. పార్లె కంపెనీలో ఒక ఏడాదిలో తయారయ్యే బిస్కెట్లను లైన్‌గా పేరిస్తే భూమిని 192 సార్లు చుట్టి రావచ్చు. 13 బిలియన్ల పార్లె జి బిస్కెట్ల తయారీకి వాడే 16,100 టన్నుల చక్కెరను వాటికన్ సిటీ నగరం మొత్తం పేర్చవచ్చు. అలాగే ఒక నెలలో తయారయ్యే పార్లె జి బిస్కెట్లను ఒకదాని పక్కన ఒకటి పేరిస్తే భూమి నుంచి చంద్రునికి వెళ్లవచ్చు. ఇలాంటి మరెన్నో ఘనతలను పార్లె జి సొంతం చేసుకుంది.
Advertisements