Advertisement
ఆ సంఘటన 1979వ సంవత్సరంలో జరిగింది. ఆ రోజు సాయంత్రం 6 గంటలవుతోంది. ఈతావాహ్ జిల్లాలోని ఉస్రాహర్ పోలీస్ స్టేషన్‌కు ఓ రైతు వచ్చాడు. సాధారణ కుర్తా, ధోతి ధరించి దుస్తులపై బురద మరకలతో ఉన్నాడు. తన గేదె తప్పిపోయిందని చెబుతూ ఆ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అడిగాడు. అక్కడే ఉన్న ఓ పోలీసు 4 ప్రశ్నలు అడిగి ఆ రైతు ఫిర్యాదును స్వీకరించకుండానే వెళ్లిపోయాడు. ఆ రైతు స్టేషన్ బయటకు వెళ్దామని వెనక్కి తిరిగాడు. వెనక నుంచి మరో పోలీసు వచ్చి చాయ్ ఖర్చులకు డబ్బు ఇవ్వు.. రిపోర్టు రాస్తా.. అని రైతును అడిగాడు.
కొంత సేపు రైతు, పోలీసు మాట్లాడుకున్న అనంతరం బేరం కుదిరింది. ఆ రైతు తన జేబులో నుంచి రూ.35 తీసి పోలీసుకు లంచం ఇచ్చాడు. పోలీస్ స్టేషన్‌లో మధ్యలో ఉన్న ఓ రూమ్‌లో ఇన్‌స్పెక్టర్ ఎదురుగా 3 కుర్చీలు ఉన్నాయి. అతని ఎదురుగా ఓ మూలన లిఖియా మున్షీ ఫిర్యాదులను రాస్తున్నాడు. ఆ రైతు ఫిర్యాదును కూడా అతను రాశాడు. నువ్వు సంతకం చేస్తావా, వేలిముద్ర వేస్తావా.. అని ఆ రైటర్ రైతును అడిగాడు. అందుకు రైతు సంతకమే చేస్తానని బదులిచ్చాడు.
Advertisement
అయితే ఆ రైతు సంతకం చేసేందుకు పెన్నుతోపాటు అక్కడే ఉన్న ఇంక్ థంబ్ ప్యాడ్‌ను కూడా తీసుకున్నాడు. దీంతో పోలీసు రైటర్.. సంతకం చేసేందుకు పెన్ను చాలదా.. థంబ్ ప్యాడ్ ఎందుకని అడిగాడు. అయినా ఆ రైతు ఆ రైటర్ మాటలను వినిపించుకోలేదు. సదరు ఎఫ్ఐఆర్ కాగితాలపై సంతకం చేశాడు. చౌదరి చరణ్ సింగ్ అని ఆ రైతు సంతకం పెట్టాడు. వెంటనే తన జేబులో ఉన్న ఓ సీల్‌ను తీసి థంబ్ ప్యాడ్‌పై ఇంక్‌ను అచ్చు తీసుకుని అవే కాగితాలపై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ముద్ర వేశాడు.
ఆ ముద్రను చూసిన రైటర్‌తోపాటు పోలీస్ స్టేషన్‌లో ఉన్న సిబ్బంది అంతా ఆ హఠాత్ పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఇతర సిబ్బందికి ఏం జరుగుతుందో కొంత సేపు అర్థం కాలేదు. వెంటనే అక్కడికి కొంత దూరంలో ఆగి ఉన్న ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కాన్వాయ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. మరుక్షణంలో ఆయన ఆ పోలీస్ స్టేషన్‌లో ఉన్న అందరినీ తీసేశారు. స్థానికంగా రైతులు ఫిర్యాదు చేయడంతో వారి సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా చరణ్ సింగే రంగంలోకి దిగి.. అలా రైతు వేషంలో దుస్తులకు బురద పూసుకుని వచ్చి, రైతులా నటిస్తూ.. సదరు పోలీసుల బాగోతం బయట పెట్టారు. అప్పట్లో ఆ సంఘటన సంచలనమే సృష్టించింది. ప్రధాని స్వయంగా అలా వెళ్లడం అందరినీ షాక్‌కు గురి చేసింది. రైతు రూపంలో వెళ్లి అవినీతి పోలీసుల బండారం బయట పెట్టడమే కాదు, రైతుల సమస్యలను కూడా ఆయన పరిష్కరించారు. నిజంగా అలాంటి నాయకులే కదా మనకు ఇప్పుడు కావల్సింది. పాలకులు అప్పుడప్పుడు అలా వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది. ప్రజలు పడే ఇబ్బందులను వారు స్వయంగా తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించగలుగుతారు.
Advertisements
Advertisements