Advertisement
ఇంట్లో తల్లిదండ్రులు కొట్టారని ఒకరు.. స్కూల్‌లో మార్కులు రాలేదని ఇంకొకరు.. అడిగింది కొనివ్వలేదని మరొకరు.. ఇలా పిల్లలు రక రకాల కారణాలతో అలిగి ఇల్లు వదిలి వెళ్లిపోతుంటారు. దీంతో తల్లిదండ్రులకు వారిని వెతికి పట్టుకోవడం కష్టతరమవుతుంది. మరోవైపు తీవ్రమైన బాధ కలుగుతుంది. ఇల్లు వదిలి వెళ్లిపోయిన తమ కుమారుడు లేదా కుమార్తె ఎన్ని అవస్థలు పడుతున్నారోనని దిగులు చెందుతారు. కానీ అలాంటి వారి బాధను ఆమె పోగొడుతోంది. ఆమే.. ఢిల్లీకి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకా.
Advertisement
సీమా ఢాకాది ఢిల్లీ. 2006లో ఢిల్లీ పోలీసు విభాగంలో చేరింది. ఆమె భర్త కూడా హెడ్ కానిస్టేబుల్. ఆమె గతంలో రోహిని, ఉత్తర ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పనిచేసింది. తాజాగా సమయ్‌పూర్ బద్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాత్సవ తప్పిపోయిన చిన్నారులను వెదికి తెస్తే ప్రమోషన్ ఇస్తామని ఆగస్టు 7న ప్రకటించారు. ఏడాదిలోగా కనీసం 50 మంది పిల్లల ఆచూకీ కనుక్కుని తల్లిదండ్రులకు అప్పగిస్తే ప్రమోషన్లు ఉంటాయని అన్నారు. దీంతో సీమా ఢాకా దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంది. కేవలం 3 నెలల్లోనే ఏకంగా 76 మంది పిల్లలను వెదికి పట్టుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగించింది. దీంతో ఆమె ప్రమోషన్ కొట్టేసింది.
అయితే సీమా ఢాకా పిల్లలను వెదికే క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కొంది. ఒకానొక దశలో పశ్చిమబెంగాల్‌లో వరదల్లో వెళ్లి ఒక బాలున్ని రక్షించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె కోవిడ్ బారిన పడింది. దాని నుంచి కోలుకున్నా మళ్లీ డ్యూటీలో చేరి తిరిగి పిల్లలను వెదికింది. అందులో విజయం సాధించి ప్రమోషన్ పొందింది. ఈ సందర్బంగా ఆమెను నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు.
Advertisements