Advertisement
ఓ చిన్ని నవ్వే నవ్వి యుద్దాలెన్నో ఆపొచ్చో లేదో నాకు తెలియదు కానీ, అతని చిరునవ్వు మాత్రం నాలో ఓ అలజడిని రేపింది. అది కాస్త ఇదిగో ఇలా ఈ ఫోటోలో ఆనందంగా కనిపించే ఫ్యామిలీగా మారింది.! సరిగ్గా రెండేళ్ల క్రితం…నేను ఓ టెక్ట్స్ టైల్ ఫ్యాక్టరీలో పనిచేసేదాన్ని, మా ఫ్యాకర్టీలోనే ఏవేవో కట్టడాలు నిర్మిస్తుండేవారు. భవన నిర్మాణానికి వచ్చే చాలా మంది తాపీ మేస్త్రీల్లో అతడొకడు…అదేంటో తెలియదు కానీ….అతను నన్ను చూసి నవ్వేవాడు, నేను అతనిని చూసి అప్రయత్నంగానే నవ్వేదాన్ని. రోజూ మేం లంచ్ చేసే ప్రదేశానికి కాస్త దూరంలో నావంకే చూస్తూ కూర్చునేవాడు అతను .అలా చాలా రోజులు కళ్ళతోనే మాటలు కొనసాగాయి.
Advertisement
అతడికి ఇక్కడ వర్క్ అయిపోయింది.అయినా…నాకోసం నా లంచ్ టైమ్ లో అదే ప్లేస్ లో కూర్చొని కనిపించేవాడు. మళ్ళీ అదే నవ్వు, అవే కన్నుల బాసలు.!! ఆ రోజు నేను అతని దగ్గరికి వెళ్ళాను..నన్ను చూసిన అతను. రోడ్డు మీద కాదు, కాస్త ప్రశాంతంగా అలా వెళ్లి మాట్లాడుకుందామని అన్నాడు. నేను కూడా సరేనని అతనితో పాటు వెళ్లాను. మాకు దగ్గర్లోని ఓ మ్యూజియం కు వెళ్లాము. అక్కడ రాజుల ఆయుధాలు, వస్తువులను చూసి నేను ఆశ్చర్యపోతుంటే…నా రాణివి అవుతావా? అంటూ అడిగాడతడు…నేనింకా రెట్టింపు ఆశ్చర్యంలో ఉన్న… ఎప్పుడు ? అని నా ప్రశ్న. నువ్వు ఎప్పుడంటే అప్పుడే అంటూ అతని సమాధానం.! అయితే ఈ రోజే అని నేనడంతో…అక్కడే దండలు మార్చుకొని మా కొత్త జీవితాన్ని ప్రారంభించాము.
నాకు రోజంతా అతనితోనే ఉండాలని ఆశ . కానీ మా జీవనం కోసం అతను పనిచేయక తప్పదు, కానీ వర్షాకాల సమయంలో ఆయనకు పని సరిగ్గా దొరకదు…ఆ టైమ్ లో నేను అనుకున్నట్టు రోజంతా నాతోనే ఉంటారు. ఆయనకు టీ తాగడం చాలా ఇష్టం…అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అతనికి టీ ఇస్తూ…అతనిని చూసుకుంటూ మురిసిపోతుంటాను.!! కోరుకున్న జీవితం కోరుకున్నట్లు జీవిస్తుంటే ఇంకా పేదరికం ఏముంటుంది చెప్పండి. !
Advertisements