Advertisement
ఎంత ధైర్య సాహసాలు ఉన్నా.. శక్తి సామర్థ్యాలు కనబరిచినా.. సమయస్ఫూర్తి అనేది ఉండాలి. ప్రశాంతంగా ఆలోచించాలి. దీని వల్ల అద్భుతాలు చేయవచ్చు. అపాయంలో ఉన్నప్పుడు తప్పించుకోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే బలం కన్నా సమయస్ఫూర్తి ఎంతగానో రక్షిస్తుంది. సమయస్ఫూర్తి విషయానికి వస్తే.. ఓ బాలుడు ఏం చేశాడో మనం తెలుసుకోవాలి.
అలహాబాద్‌లో ఓ పెద్ద తోట అది. అక్కడ కొందరు బాలురు క్రికెట్ ఆడుతున్నారు. ఒక బాలుడు తన శక్తినంతా ప్రయోగించి భారీ షాట్ కొట్టాడు. దీంతో బంతి అక్కడికి సమీపంలో ఉన్న ఓ మర్రిచెట్టు తొర్రలో పడింది. ఆ బంతిని బయటకు తీసేందుకు బాలురందరూ ప్రయత్నించారు. కానీ ఎవరికీ సాధ్యం కాలేదు. ఆ బంతి చెట్టు తొర్ర కింది భాగంలో ఉంది. దాన్ని తీసేందుకు ఎవరికీ చేతులు అందడం లేదు.
Advertisement
Advertisements
అయితే అప్పుడు ఒక బాలుడు వచ్చి తాను ఆ బంతిని తీస్తానని, ఒక బకెట్ నీటిని తీసుకురావాలని ఇతర బాలురకు చెప్పాడు. దీంతో వారు మొదట ఖంగు తిన్నా.. తరువాత ఒక బాలుడు పరిగెత్తుకు వెళ్లి ఒక బకెట్ నిండా నీటిని తెచ్చాడు. ఈ క్రమంలో ఆ బాలుడు ఆ నీటిని ఆ చెట్టు తొర్రలో పోశాడు. తొర్ర నిండగానే బంతి పైకి వచ్చింది. సులభంగా దాన్ని బయటకు తీశాడు. దీంతో ఆ బాలున్ని అందరూ మెచ్చుకున్నారు. ఇంతకీ ఆ బాలుడు ఎవరో తెలుసా..? ఆయనే చాచా నెహ్రూ. ఆలోచన, సమయస్ఫూర్తి ఉంటే ఏ సమస్యను అయినా ఇట్టే పరిష్కరించుకోవచ్చు.. అని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
Advertisements