Advertisement
పూర్వం రాజులు యుద్ధాలు చేసినప్పుడు.. రణరంగానికి వెళ్లేముందు వారి భార్యలు వారికి వీరతిలకం దిద్ది యుద్ధం చేయమని పంపించేవారు. ఈ క్రమంలోనే రాజు తమ పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకుని యుద్ధానికి వెళ్లేవారు. అయితే ఆ మహారాణి మాత్రం తన భర్తను యుద్ధానికి పంపించడం కోసం ఏకంగా తన ప్రాణాన్నే త్యాగం చేసింది. అవును.. భర్త తనను విడిచి ఉండలేకపోతున్నాడని భావించిన ఆమె అతన్ని ఎలాగైనా యుద్ధానికి పంపాలని భావించి తనను తాను ప్రాణత్యాగం చేసుకుంటుంది. ఆమే.. రాజ్‌పూత్ వంశానికి చెందిన హదీ రాణి.
రాజస్థాన్‌లోని హదా చౌహాన్ రాజ్‌పూత్ కుమార్తె హదీ రాణి. ఆమె అక్కడి మేవార్‌లోని సాలుంబర్‌కు చెందిన రాజు చుండావత్ చీఫ్తెయిన్‌ను వివాహం చేసుకుంటుంది. అయితే మహారాణా రాజ్ సింగ్ (1653-1680) చక్రవర్తి చుండావత్‌ను వెంటనే యుద్ధంలో పాల్గొనేందుకు రమ్మని పిలుస్తాడు. ఔరంగజేబు తమ సామ్రాజ్యాన్ని ముట్టడించాడని, కనుక వెంటనే యుద్ధంలో పాల్గొనేందుకు రావాలని చుండావత్‌ను పిలుస్తాడు. కానీ హదీ రాణికి, చుండావత్‌కు వివాహం అయి అప్పటికి కేవలం ఒక్క రోజే అవుతుంది. అందువల్ల అతను భార్యను విడిచిపెట్టి యుద్ధానికి వెళ్లేందుకు విముఖతను వ్యక్తం చేస్తాడు.
Advertisement
అయితే విషయం తెలుసుకున్న హదీ రాణి యుద్ధానికి వెళ్లాల్సిందిగా ప్రోత్సహిస్తుంది. దీంతో చుండావత్ యుద్ధానికి బయల్దేరతాడు. అయినప్పటికీ అతనికి తన భార్యను విడిచిపెట్టి వెళ్లబుద్ధి కాదు. దీంతో ఆమె గుర్తుగా ఏదైనా వస్తువు తెమ్మని భటుడికి చెబుతాడు. భటుడు వెళ్లి విషయాన్ని హదీ రాణికి చెబుతాడు. దీంతో ఆమె ఆశ్చర్యానికి లోనవుతుంది. తన భర్త యుద్ధానికి వెళ్లేందుకు తాను ప్రతిబంధంకంగా ఉన్నానని, తాను లేకపోతే అతను యుద్ధం చేస్తాడని భావించిన ఆమె తన తలను కత్తితో నరికి భటుడితో దాన్ని చుండావత్‌కు పంపిస్తుంది. దీంతో చుండావత్ నిశ్చేష్టుడవుతాడు. తన భార్య త్యాగానికి చలించిపోతాడు. వెంటనే తేరుకుని ఆమె తలను వెనుక కట్టుకుని యుద్ధ రంగంలోకి దిగుతాడు.
అలా చుండావత్ రణ రంగంలో ఉగ్ర రూపంతో కదులుతూ ఔరంగజేబు సైన్యాన్ని తుత్తునియలు చేస్తాడు. దెబ్బకు ఔరంగజేబు సేనలు యుద్ధం వదిలి పారిపోతాయి. దీంతో మహారాణా రాజ్ సింగ్ యుద్ధంలో గెలుస్తాడు. తరువాత చుండావత్ తన భార్య లేని జీవితం వ్యర్థం అని భావించి తన తలను కూడా నరుక్కుని ప్రాణ త్యాగం చేస్తాడు. ఇదీ.. ఆ రాజ జంట ప్రేమకు నిదర్శనం. అలాగే మాతృదేశం కోసం ఏం చేయడానికైనా వెనుకాడకూడదనే విషయాన్ని ఈ సంఘటన మనకు చాటి చెబుతుంది.
Advertisements
Advertisements