Advertisement
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. అయోధ్యలోని కుబేర తిల ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం రామ మందిర నిర్మాణ పనులను ప్రారంభించారు. కాగా ఈ పనుల ప్రారంభం నేపథ్యంలో గతంలో భూమి పూజ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే ముందుగా శివ పూజ చేయడం ద్వారా రాముడు పాటించిన సాంప్రదాయాన్ని తాము అనుసరించామని రామ మందిర ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.
కాగా ఆలయ నిర్మాణ పనుల ప్రారంభం నేపథ్యంలో సుమారుగా 2 గంటల పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ పూజల్లో మహంత్ కమల్ నయన్‌దాస్‌తోపాటు పలువురు పండితులు కూడా పాల్గొన్నారు. అయితే విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), రామ జన్మభూమి న్యాస్‌ల ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సొంపుర తీర్చిదిద్దిన డిజైన్‌కు అనుగుణంగానే రామమందిర నిర్మాణం జరగాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్.. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును కోరారు. రామ మందిర నిర్మాణ ఉద్యమంలో అదే డిజైన్‌ను విస్తృతంగా ప్రచారం చేసినందున అదే డిజైన్‌ను ఆలయ నిర్మాణం కోసం వాడాలని సూచించారు.
Advertisement
కాగా వీహెచ్‌పీ చీఫ్ అశోక్ సింఘాల్.. చంద్రకాంత్ సొంపురకు రామ మందిర నిర్మాణ డిజైన్‌ను తీర్చిదిద్దాలని గతంలోనే కోరగా.. చంద్రకాంత్ ఆ పనిని అప్పట్లోనే పూర్తి చేశారు. ఇక చంద్రకాంత్ తాత ప్రభా శంకర్ సొంపుర కూడా ఆర్కిటెక్ట్ కావడం విశేషం. ఆయన రామ మందిర నిర్మాణంపై 14 పుస్తకాలను రాశారు. ఇక సోమనాథ్ ఆలయాన్ని కూడా ఆయన రీడిజైన్ చేశారు. కాగా చంద్రకాంత్ లండన్‌లోని నెయిస్‌డెన్‌లో ఉన్న స్వామి నారాయణ ఆలయాన్ని 28 నెలల పాటు కష్టపడి డిజైన్ చేశారు.
Advertisements
Advertisements
రామ మందిరాన్ని ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాల్లో ఉన్న ఆలయాల నిర్మాణ శైలికి అనుగుణంగా నిర్మించనున్నారు. సిమెంట్, స్టీల్ కాకుండా కేవలం రాళ్లతోనే శ్లాబులు నిర్మించనున్నారు. ఈ క్రమంలో మందిర నిర్మాణం పూర్తిగా నగర నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. అయితే ప్రధాని మోదీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అందువల్లే ఈ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేకపోయారు. ఇక రామ మందిర నిర్మాణానికి ఉపయోగించే రాళ్లపై ఇప్పటికే డిజైన్లను గీయడం 40 శాతం మేర పూర్తి చేశామని చంద్రకాంత్ తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తి అయ్యేందుకు 24 నుంచి 30 నెలల వరకు సమయం పట్టవచ్చని ఆయన తెలిపారు.