Advertisement
హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతం.. పురానీ హవేలీ మీదుగా క్రాస్ రోడ్‌కు చేరుకుంటే.. అక్కడ కమ్మని నాన్ (naan) వాసన మన నోట్లో నీళ్లూరేలా చేస్తుంది. ఇంకాస్త ముందుకు వెళితే.. వరండాల్లో పెద్ద ఎత్తున తందూర్ నాన్స్ తయారు చేస్తూ కనిపిస్తారు. అదే హైదరాబాద్‌కు చెందిన ఫేవరెట్ తందూర్ నాన్‌లను అందించే షాపు.. ఖాదీం మున్షీ నాన్.. హైదరాబాద్ పాత బస్తీలో గత 4 దశాబ్దాలకు పైగానే అనేక తందూర్ నాన్స్‌ను తయారు చేసే షాపులు ఏర్పడ్డాయి. కానీ వాటిల్లో 167 ఏళ్ల చరిత్ర కలిగిన ఖాదీం మున్షీ నాన్ అనే షాపు ఫేమస్. నిజాం కాలంలో ఆ షాపును నెలకొల్పి.. అప్పటి నుంచి హైదరాబాదీలకు రుచికరమైన తందూరీ నాన్స్‌ను అందిస్తున్నారు.
1851లో 4వ నిజాం బహదూర్ అసిఫ్ జహా హయాంలో అకౌంటెంట్ కమ్ క్లర్క్‌గా పనిచేసే మహమ్మద్ హుస్సేన్ సాహెబ్ అనే వ్యక్తి పురానీ హవేలీ వద్ద చిన్న నాన్స్ తయారీ షాపును ఏర్పాటు చేశాడు. అందులో తందూరీ నాన్స్‌ను తయారు చేసేవారు. అయితే పాతబస్తీలో అప్పట్లో ఆ నాన్స్ స్థానికులకు ఎంతో రుచికరంగా అనిపించడమే కాదు.. రాను రాను వాటికి జనాలు ఆకర్షితులయ్యారు. దీంతో ఆ నాన్స్‌కు ఒక ప్రత్యేకత ఏర్పడి అది అలా ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అప్పట్లోనే ఆ షాపుకు మున్షీ నాన్ అనే పేరు వచ్చింది.
ప్రస్తుతం హుస్సేన్ సాహెబ్‌కు చెందిన 4వ తరం వారసులు ఆ నాన్ తయారీ షాపును నిర్వహిస్తున్నారు. చుట్టు పక్కల అలాంటి నాన్స్‌ను తయారు చేసే షాప్స్ ఎన్నో వచ్చాయి. కానీ అవేవీ మున్షీ నాన్స్ అంత రుచి అందించలేకపోయాయి. అందుకనే వారు ఇప్పటికీ మార్కెట్‌లో నిలదొక్కుకుని ఉన్నారు. ఇప్పటికీ ఆ షాపు ఎదుట భోజన ప్రియులు తాజా నాన్స్, సీఖ్ కెబాబ్స్ కోసం క్యూలు కడుతుంటారు.
Advertisements
మున్షీ షాపులో అమ్మే చార్ కోని నాన్స్ అంత రుచికరంగా ఉండేందుకు కారణం.. అవి చక్కని సువాసనను కలిగి ఉండడమే. అంతేకాదు.. అవి బయటికి క్రిస్పీగా ఉంటాయి. లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. అందుకనే అవి అంత రుచికరంగా ఉంటాయి. ప్రస్తుతం ఆ షాపులో నిత్యం 1 వేయికి పైగా నాన్స్‌ను తయారు చేసి పలు బ్యాచ్‌లలో అమ్ముతుంటామని.. షాపును నిర్వహించే ఖాజా అబ్దుల్ హమీద్ చెబుతారు.
Advertisement
మేం నిత్యం 3 నుంచి 4 క్వింటాళ్ల మైదాను నాన్స్‌ను తయారు చేసేందుకు ఉపయోగిస్తాం. మాకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. వారు నిత్యం వచ్చి నాన్స్‌ను కొంటారు. మేం పార్టీలు, యానివర్సరీలు, ఇతర ఫంక్షన్లకు ఆర్డర్లపై కూడా నాన్స్‌ను సప్లయి చేస్తాం. చార్ కోని నాన్స్‌ను పండగల సమయంలో ఎక్కువగా తింటారు. ప్రత్యేకించి పాత బస్తీలో ఈ నాన్స్‌ను ప్రజలు ఎక్కువగా తింటారని.. హమీద్ తెలిపారు.
మొగల్ చక్రవర్తుల హయాంలో ఢిల్లీ నుంచి చార్ కోని నాన్ రెసిపి హైదరాబాద్‌కు వచ్చిందని చెబుతారు. ఆ రెసిపి ఇప్పటికీ అలాగే ఉందని, ఏమాత్రం మారలేదని, అదే రుచిని సంవత్సరాలుగా అందిస్తుండడం వల్లే కస్టమర్లు తమ షాపుకు మళ్లీ మళ్లీ వస్తుంటారని.. నిర్వాహకులు తెలిపారు. వారు నాన్స్‌ను 2 రకాల ఆకృతుల్లో తయారు చేస్తారు. కానీ చార్ కోని నాన్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. దీన్ని 4 పీసులుగా సులభంగా కట్ చేసి తినవచ్చు.
మున్షీ నాన్ షాపులో వర్కర్లు మైదాను ప్రిపేర్ చేసి వాటిని నాన్స్‌లా తయారు చేస్తారు. అనంతరం వాటిపై రోల్ పిన్ సహాయంతో డిజైన్లు వచ్చేలా చేస్తారు. తరువాత వాటిని తందూర్ బట్టీలో బెల్లం సహాయంతో లోపలి వైపు అతికిస్తారు. ఆ బట్టీలో ఇనుప లోహాన్ని కరిగించేంత ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ క్రమంలో ఒక బట్టీలో ఒక్కసారికి 7 నుంచి 8 నాన్‌లను అతికిస్తారు. తరువాత 5 నుంచి 7 నిమిషాలకు వాటిని బట్టీ నుంచి తీసి తెల్లని వస్త్రంపై పేరుస్తారు. అవి చల్లగా అయ్యాక వాటిని తీసి షాపు ముందు ఉన్న గ్లాస్ ర్యాక్‌లలో పెడతారు. అనంతరం వాటిని కస్టమర్లు కొనుగోలు చేస్తారు.
Advertisements
చార్ కోని నాన్స్‌ను వేడిగా ఉండగానే తినాలి. మటన్ సూప్, పెరుగు రైతా, చికెన్ కర్రీలలో దేంతోనైనా ఈ నాన్స్‌ను తినవచ్చు. ఇక ప్రస్తుతం తమ షాపును అక్కడే విస్తరిస్తున్నట్లు హమీద్ తెలిపారు. గత 4 తరాలుగా తమకు ఈ ఒక్క షాపు తప్ప ఎక్కడా బ్రాంచులు లేవని, కానీ కొందరు తమ బ్రాంచులని చెప్పి సిటీలో కొన్ని చోట్ల ఈ తరహా నాన్స్‌ను విక్రయిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ తాము తయారు చేసే నాన్స్ ఎంతో ప్రత్యేకమని ఆయన చెబుతారు. ఇక షాపు మొదటిసారిగా ప్రారంభమైనప్పుడు కేవలం 2 అణాలకే ఒక నాన్‌ను విక్రయించామని, ప్రస్తుతం ఒక నాన్‌ను రూ.14కు అమ్ముతున్నామని తెలిపారు. మీరు కూడా.. హైదరాబాద్ పాత బస్తీలో అటు వైపుగా వెళితే.. ఆ నాన్స్‌ను ఒక్కసారి ట్రై చేయండి మరి..!