Advertisement
కరోనా ఏమోగానీ ప్రస్తుత తరుణంలో ఈ-కామర్స్ సైట్లలో ఉత్పత్తులకు భలే గిరాకీ పెరిగింది. కరోనా భయం వల్ల జనాలు ప్రస్తుతం బయటకు వెళ్లడం కన్నా ఆన్‌లైన్‌లోనే వస్తువులను కొనడం మిన్న.. అని భావిస్తున్నారు. అందుకనే ఈ-కామర్స్ సంస్థ వ్యాపారం మునుపటి కన్నా ఇప్పుడు జోరుగా కొనసాగుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఖాదీ పేరిట పలు కంపెనీలు ఈ-కామర్స్ సైట్లలో పలు ఉత్పత్తులను అమ్ముతున్నాయి. కానీ అవన్నీ నకిలీవని తేలింది. దీంతో కేంద్రం ఈ-కామర్స్ సైట్లకు ఆయా నకిలీ ఉత్పత్తులను అమ్మకూడదని ఆదేశాలు జారీ చేసింది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తదితర ఈ-కామర్స్ సైట్లలో పలువురు సెల్లర్లు ఖాదీ పేరిట నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్నారు. దీంతో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ఆయా సంస్థలకు సదరు నకిలీ ఉత్పత్తులను అమ్మకూడదని, వాటికి సంబంధించిన లింక్‌లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇదే విషయమై ఇప్పటికే 1000 వరకు సంస్థలకు లీగల్ నోటీసులను కూడా పంపించారు. ఖాదీ ఇండియా బ్రాండ్ పేరిట పలువురు ఆన్‌లైన్‌లో నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది.
Advertisement
ఈ-కామర్స్ సంస్థల సైట్లలో ఖాదీ మాస్కులు, హెర్బల్ సోప్‌లు, షాంపూలు, కాస్మొటిక్స్, హెర్బల్ మెహిందీ, జాకెట్స్, కుర్తా తదితర ఉత్పత్తులను అనేక మంది సెల్లర్లు విక్రయిస్తున్నారు. అయితే అవన్నీ ఒరిజినల్ ఖాదీ బ్రాండ్‌నకు చెందినవని పేర్కొంటూ వారు వాటిని అమ్ముతున్నారు. కానీ అవన్నీ నకిలీవని గుర్తించారు. ఖాదీ బ్రాండ్ పేరిట ఆయా నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. దీంతో కేవీఐసీ అలాంటి ఉత్పత్తులకు చెందిన 140 కి పైగా లింక్‌లను ఈ-కామర్స్ సైట్ల నుంచి తొలగించినట్లు తెలిపింది.
వినియోగదారులు లాక్ డౌన్ సమయంలో ఈ ఫేక్ ఖాదీ ఉత్పత్తులను ఎక్కువగా కొన్నారని కేవీఐసీ తెలిపింది. ఈ క్రమంలో ఖాదీ బ్రాండ్ పేరిట వినియోగదారులను మోసం చేస్తున్న ఖాదీ ఎసెన్షియల్స్, ఖాదీ గ్లోబల్ అనే సంస్తలకు కేవీఐసీ తాజాగా లీగల్ నోటీసులను పంపించింది. ఇక మరోవైపు తమకు రూ.500 కోట్ల మేర నష్టపరిహారం అందించాలని కోరుతూ కేవీఐసీ ఇప్పటికే ఫాబ్ ఇండియాకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ప్రస్తుతం ముంబై హైకోర్టులో విచారణలో ఉంది.
Advertisements
Advertisements