Advertisement
ప్రపంచంలో అనేక దేశాల్లో చిత్రాతి చిత్రమైన ప్రదేశాలు ఉంటాయి. కొన్ని చారిత్రకంగా పేరుగాంచినవి అయితే.. కొన్ని కాలక్రమేణా ఏర్పడ్డవి. అలాంటి చిత్రమైన ప్రదేశాల్లో స్పెయిన్‌లోని కాడిజ్ ప్రావిన్స్‌లో ఉన్న సెటెనిల్ డి లాస్ బొడెగాస్ టౌన్ కూడా ఒకటి. ఇది చాలా చిన్న టౌన్. కానీ చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. పూర్తిగా కొండప్రాంతంలో ఈ టౌన్ ఉంటుంది.
సెటెనిల్ టౌన్‌లో ఇండ్లను పెద్ద పెద్ద రాళ్లను తొలిచి నిర్మించారు. అందువల్ల రాళ్లలో ఆ ఇండ్లు కలిసిపోయి ఉంటాయి. ఇళ్లన్నీ దాదాపుగా తెలుపు రంగు పెయింట్‌తోనే మనకు దర్శనమిస్తాయి. ఇక 2005 లెక్కల ప్రకారం ఈ టౌన్ జనాభా 3016. స్పెయిన్‌లోని కాడిజ్ ప్రావిన్స్‌కు సుమారుగా 157 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో ఈ టౌన్ ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు కనిపిస్తాయి.
Advertisement
Advertisements
ఈ టౌన్ ఉండే కొండపై ఓ కోట ఉంటుంది. అది పూర్వ కాలంలో అరబ్బుల కోటగా ఉండేది. ఇక ఈ టౌన్‌లో చాలా వరకు ఇండ్లు కొండలో ఇమిడి ఉంటాయి. అందువల్ల చూసేందుకు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడి ప్రాంత వాసులు మాంసాహారం ఎక్కువగా తింటారు. మాంసాహారం ఉత్పత్తికి కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ బేకరీల్లో తయారయ్యే పేస్ట్రీలు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. అలాగే ఈ టౌన్‌లో భిన్న రకాల బార్లు, రెస్టారెంట్లు కూడా పర్యాటకులను అలరిస్తాయి. ఈ టౌన్‌లో చాలా మంది పండ్లు, కూరగాయలను కూడా పండిస్తారు. అందువల్ల అవి ఇక్కడ తాజాగా లభిస్తాయి. ఏది ఏమైనా చూసేందుకు మాత్రం ఈ టౌన్ భలే విచిత్రంగా ఉంది కదా..!
Advertisements