Advertisement
మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక నిమిషానికి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ఏటా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యలు చేసుకునేందుకు అనేక మందికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఏ సమస్య వచ్చినా అందుకు ఆత్మహత్య పరిష్కారం కాదు. కానీ కొందరు మాత్రం ఇలా ఆలోచించరు. ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గం అని ఆలోచిస్తుంటారు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని ముందుగానే కనిపెట్టడం కూడా అసాధ్యం. కానీ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించే చాలా మందిని మాత్రం అతను కాపాడుతున్నాడు. అతనే.. హైదరాబాద్‌కు చెందిన శివ.
శివ పూర్తి పేరు వడ్డె శివ. కానీ ఈయన్ను అందరూ ట్యాంక్ బండ్ శివ అని పిలుస్తారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్యకు యత్నించిన 114 మందిని ఈయన ఇప్పటి వరకు కాపాడారు. అందుకనే ఆయనకు ట్యాంక్ బండ్ శివ అని పేరు వచ్చింది. ఇక ఆయన ఈ పనిని 23 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఒకసారి గణేష్ నిమజ్జనాల సమయంలో హుస్సేన్ సాగర్‌లో దూకిన ఓ మహిళను కాపాడానని.. కానీ ఆమెను కాపాడే యత్నంలో నీటిలోకి దూకినప్పుడు తన భుజంలోకి విగ్రహంలోని ఓ ఇనుప రాడ్ లోతుగా గుచ్చుకుందని, కానీ ఆ ప్రమాదం నుంచి బయటపడి బతికిపోయానని శివ తెలిపాడు.
శివ అనాథ్రామంలో పెరిగాడు. జీవనోపాధి కోసం అనేక రకాల పనులు చేశాడు. కానీ చివరకు ఈ వృత్తిలో కొనసాగుతున్నాడు. చిన్నతనం నుంచే ఆయన సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం మొదలు పెట్టాడు. ఆయనకు మరికొందరు మిత్రులు కలిశారు. దీంతో ప్రస్తుతం వారు కూడా శివ లాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
Advertisement
ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన వారిని కాపాడితే తనకు ఆత్మ సంతృప్తి కలుగుతుందని శివ తెలిపాడు. తనకు ఆ పనిలో ఆనందం లభిస్తుందన్నాడు. ఓ సోదరి, ఓ సోదరున్ని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడినందుకు తనకు ఎంతగానో సంతోషం కలుగుతుందని తెలిపాడు.
Advertisements
శివ కేవలం ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని కాపాడడమే కాదు.. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో డెడ్ బాడీలను తీసేందుకు కూడా పోలీసులు ఇతన్నే పిలుస్తారు. అలా ఇతను పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇక ట్యాంక్ బండ్ వద్దకు ఆత్మహత్య చేసుకునేందుకు అనేక రకాల వారు వస్తుంటారని శివ తెలిపాడు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు, గొడవపడే భార్యా భర్తలు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, వృద్ధాప్యంలో జీవించలేక తనువు చాలించాలనుకునే వృద్ధులు ఎక్కువగా ట్యాంక్ బండ్‌కు వస్తారని శివ తెలిపాడు. అయితే ప్రస్తుతం కరోనా ఉన్నప్పటికీ శివ సేవలందిస్తున్నాడు. నిత్యం డెడ్‌బాడీలను కలెక్ట్ చేయడం, ట్యాంక్ బండ్ పరిసరాల్లో తిరుగుతూ హుస్సేన్ సాగర్‌లో దూకే వారిని కాపాడడం ఇతని దినచర్య.
శివ ఇంత పనిచేస్తున్నా ఇప్పటికీ అతనికి స్థిరమైన ఆదాయం లేదు. అయినప్పటికీ చేసే పనితోనే ఉపాధి పొందుతున్నాడు. ఎవరో ఒకరు ఏదో ఒక సహాయం చేస్తుంటారు. అలాగే వినాయక నిమజ్జనాల సమయంలో విగ్రహాల నుంచి వచ్చే ఇనుమును సేకరించి ఇతను అమ్ముకుని జీవిస్తుంటాడు. ఇతనికి కుటుంబం కూడా ఉంది. ట్యాంక్ బండ్ దగ్గర్లోనే ఇతను నివాసం ఉంటున్నాడు. పోలీసులు శివ పిల్లల్ని హాస్టల్‌లో చేర్పించి చదివిస్తున్నారు. ఇక తన పిల్లల్లో ఒకర్ని ఆర్మీలో చేర్పించాలని ఉందని, మరొకరిని పోలీసును చేయాలని ఉందని శివ తెలిపాడు.
Advertisements
Credits: BBC Telugu