Advertisement
భారత ప్రభుత్వం త్వరలో నిర్మించతలపెట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ను టాటా కంపెనీ దక్కించుకుంది. మొత్తం రూ.861.90 కోట్లకు టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకుంది. ఇందుకు గాను ఎల్ అండ్ టీ కంపెనీ పోటీ పడింది. కానీ బిడ్డింగ్‌లో ఎల్ అండ్ టీ ఓడిపోయింది. ఆ కంపెనీ రూ.865 కోట్లకు బిడ్ వేయగా.. అంతకన్నా తక్కువకు కోట్ చేసిన టాటా కంపెనీకి పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టు దక్కింది.
కాగా నూతన పార్లమెంట్ భవనాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. జనవరిలో పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. 2022లో భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుందని అప్పటి వరకు నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని అన్నారు. అందుకనే అప్పటి లోగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.
Advertisement
ఇక ఈ ప్రాజెక్టుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.940 కోట్ల అంచనా వ్యయాన్ని లెక్క వేయగా అంతకన్నా తక్కువ ఖర్చుతోనే టాటా కంపెనీ పార్లమెంట్ భవనాన్ని నిర్మించనుండడం విశేషం. కొత్త పార్లమెంట్ భవనాన్ని ఇప్పటికే ఉన్న పార్లమెంట్ భవనం పక్కనే నిర్మిస్తారు. పార్లమెంట్ హౌజ్ ఎస్టేట్‌లో నూతన భవనాన్ని ప్లాట్ నం.118గా ఇప్పటికే అమోదించారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనాన్ని 1921లో నిర్మించడం ప్రారంభించారు. బ్రిటిష్ వారి కాలంలో అప్పట్లో ఆ భవనాన్ని నిర్మించేందుకు 6 ఏళ్లు పట్టింది. తరువాత 1956లో మరో రెండు అంతస్థులను అందులో నిర్మించారు.
అయితే త్వరలో దేశంలో లోక్‌సభ నియోజకవర్గాలను పునర్‌వ్యవస్థీకరించనుండడంతో ఎంపీ స్థానాల సంఖ్య పెరగనుంది. ఈ క్రమంలో పెరిగే స్థానాలకు గాను పార్లమెంట్ భవనంలో చోటు లేదు. అందుకనే కేంద్రం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు పూనుకుంది. ఇక ఇప్పటికే ఉన్న భవంతికి కూడా అక్కడక్కడా పగుళ్లు వచ్చాయి. దీంతో ఆ భవనం శ్రేయస్కరం కాదని చెబుతూ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు.
Advertisements
ఇక ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం వృత్తాకారంలో ఉండగా.. కొత్త భవనాన్ని త్రిభుజాకారంలో నిర్మిస్తారు. కొత్త భవనాన్ని నిర్మించాక అందులో సమావేశాలు నిర్వహిస్తారు. అదే సమయంలో పాత భవనానికి మరమ్మత్తులు చేసి దాన్ని ఇతర పనులకు వాడుతారు. అయితే కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంపై ప్రతిపక్షాలు కోర్టుకెక్కాయి. దీనిపై ఇక త్వరలో ఏం జరుగుతుందనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Advertisements