Advertisement
శివభక్తులు ప్రతి సోమవారం శివున్ని ఆరాధిస్తారన్న సంగతి తెలిసిందే. అలాగే కార్తీక సోమవారాల్లో, మహాశివరాత్రి సమయంలో శివున్ని భక్తులు పెద్ద సంఖ్యలో పూజిస్తారు. అందులో భాగంగానే ఆయనను అనేక రకాల పత్రాలు, పుష్పాలతో పూజిస్తారు. పలు ఆహారాలను నైవేద్యంగా పెడుతారు. దాంతో తమకు శివుడి ఆశీస్సులు లభిస్తాయని వారు నమ్ముతారు. అయితే కొన్ని రకాల పత్రాలు, పదార్థాలను మాత్రం శివుడి పూజకు అస్సలు ఉపయోగించరాదు. అవేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం..
1. తులసి ఆకులు
పురాణాల ప్రకారం తులసి ఆకులను శివపూజకు వాడరాదు. ఎందుకంటే తులసి భర్తను శివుడు చంపేశాడు. అప్పటి నుంచి తులసి తనకు సంబంధించిన ఏ భాగాన్ని కూడా శివపూజకు వాడరాదని చెబుతుంది. అందువల్ల తులసిని శివపూజకు వాడరాదు. కానీ విష్ణుపూజలో తులసిని తప్పక ఉపయోగించాలి.
2. కేతకీ పుష్పం
ఈ పువ్వు సువాసనలను వెదజల్లుతుంది. అయినప్పటికీ శివపూజకు ఈ పువ్వును వాడకూడదు. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువు అతి పొడవైన శివలింగం ఆది, అంతం కనుగొనేందుకు శివుడి ఆజ్ఞపై వెళ్తారు. ఎంత వెళ్లినా శివలింగం కింది భాగం కనబడదు. దీంతో విష్ణువు వెనక్కి వచ్చి తన వల్ల కాలేదని చెబుతాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను పైభాగాన్ని చూశానని అందుకు కేతకీ పువ్వే సాక్ష్యమని చెబుతాడు. కానీ కేతకీ పువ్వు మాత్రం అది అబద్ధమని చెబుతుంది. బ్రహ్మే తనను అలా చెప్పమన్నాడని అంటుంది. దీనికి ఆగ్రహించిన శివుడు బ్రహ్మను ఎవరూ పూజించకూడదని శపించడంతోపాటు, కేతకీ పువ్వును పూజకు పనికిరావని శపిస్తాడు. కనుక ఆ పువ్వును శివపూజలో వాడరాదు.
Advertisements
3. చంపక పుష్పం
నారదుడు పెంచుకునే చంపక పుష్పాలను ఓ రాక్షసుడు దొంగిలించి శివపూజకు వాడుతుంటాడు. అయితే ఆ విషయాన్ని కనిపెట్టిన నారదుడు ఆ రాక్షసున్ని, చంపక మొక్కను శపిస్తాడు. ఇకపై ఆ పూలు శివపూజకు వాడొద్దని అంటాడు. అప్పటి నుంచి ఆ పువ్వులను శివపూజకు వాడడం లేదు.
Advertisement
4. కొబ్బరినీళ్లు
కొబ్బరికాయను కొట్టాక కేవలం కొబ్బరిని మాత్రమే శివుడికి నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరినీళ్లను పెట్టకూడదు. ఇందుకు పురాణాల్లోనూ పెద్దగా ఏం కారణలు చెప్పలేదు. కానీ ఎప్పటి నుంచో ఉన్న ఆచారాన్ని భక్తులు గౌరవించాల్సిందే కదా.
5. కుంకుమ, సింధూరం
శివుని భార్య పార్వతి, కుమారుడు విఘ్నేశ్వరుడి పూజలకు కుంకుమ, సింధూరం వాడుతారు. కానీ శివపూజకు కుంకుమ వాడరాదు. ఎందుకంటే శివుడు శ్మశానాల్లో ఉంటాడు. బూడిద ధరిస్తాడు. కనుక శివపూజకు కుంకుమ ఉపయోగించరాదు. ఇక శివుడు ప్రాణాలను హరించే లయకారకుడు కనుక ఆయనను మహిళలు కుంకుమతో అస్సలు పూజించరాదు. కేవలం బూడిదనే వాడాలి.
6. పసుపు
పసుపును మహిళలు సౌందర్యం కోసం వాడుతారు. కనుకనే దాన్ని ఎక్కువగా అమ్మవారి పూజల్లో ఉపయోగిస్తారు. కానీ శివ పూజకు మాత్రం పసుపును వాడరు.. వాడరాదు.
7. రాగి
పురాణాల ప్రకారం రాగి పాత్రలను మాత్రమే పూజలకు ఉపయోగించాలి. అలాగే శివపూజకు కూడా రాగి పాత్రలనే వాడాలి. ఇత్తడి పాత్రలను వాడరాదు. ఇత్తడి పాత్రలను వాడడం అశుభమని చెబుతారు.
8. రోగం సోకిన బిల్వ పత్రాలు:
రోగం సోకిన బిల్వ వృక్షానికి చెందిన పత్రాలు లేదా రోగం ఉన్న బిల్వ పత్రాలను శివపూజకు వాడరాదు. అలా వాడడాన్ని అశుభానికి సంకేతంగా భావిస్తారు.
Advertisements