Advertisement
మన చుట్టూ ప్రకృతిలో ఉండే జీవాలన్నింటినీ రక్షించే ఎవరైనా.. ఇతర ఏ జీవులు అయినా సరే.. హీరోలే.. ఇతర జీవుల ప్రాణాలను కాపాడే ఏ జీవి అయినా రియల్ హీరోయే. కేవలం మనుషులు మాత్రమే ఇతరుల ప్రాణాలను కాపాడాలనే రూల్ ఏమీ లేదు. జంతువులు, ఇతర జీవులు కూడా ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు. అవును.. అందుకనే ఆ ఎలుక చేస్తున్న పనిని వారు గుర్తించారు. దానికి వారు గోల్డ్ మెడల్‌ను కూడా అందజేశారు. ఇంతకీ అసలు ఏంటా ఎలుక ? దాని కథేమిటి ? అంటే…
ప్రపంచ వ్యాప్తంగా ఏటా అనేక మంది ల్యాండ్ మైన్ల బారిన పడి చనిపోతున్నారు. అనేక మంది తీవ్రగాయాలకు గురై అంగ వైకల్యంతో మిగిలిపోతున్నారు. ఇక కంబోడియాలో అయితే ల్యాండ్ మైన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే వాటిని గుర్తించేందుకు గాను అక్కడ 1990 నుంచి అపోపో అనే చారిటీ సంస్థ వారు ఎలుకలకు శిక్షణ ఇస్తున్నారు. అయితే ల్యాండ్‌మైన్లను గుర్తించడంలో ఆఫ్రికాకు చెందిన జియాంట్ పౌచ్‌డ్ ఎలుకలు బాగా పనిచేస్తున్నాయని గుర్తించి వాటికి శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు. అలా శిక్షణ తీసుకున్నదే.. మగావా అనే ఎలుక. దీన్ని హీరో ర్యాట్ అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇది అనేక ల్యాండ్ మైన్లను గుర్తించింది. కనుకనే దాన్ని ఆ పేరుతో పిలుస్తున్నారు.
Advertisement
మగావా ఎలుక సాధారణ ఎలుకల కన్నా కొద్దిగా సైజులో పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ ల్యాండ్ మైన్ల మీద వీటి బరువు ప్రభావం పడదు. పైగా ల్యాండ్ మైన్‌ను ఇది సులభంగా గుర్తిస్తుంది. దీంతో ఆ ల్యాండ్ మైన్లను సులభంగా బయటకు తీసి నిర్వీర్యం చేస్తారు. అలా ఇప్పటి వరకు ఈ ఎలుక మొత్తం 39 ల్యాండ్ మైన్లను గుర్తించింది. అలాగే మరో 28 పేలుడు పదార్థాలను గుర్తించింది. ఈ ఎలుక కేవలం 30 నిమిషాల్లోనే ఒక టెన్నిస్ కోర్టు అంత స్థలం మొత్తాన్ని జల్లెడ పట్టగలదు. అదే స్థలంలో పేలుడు పదార్థాలు ఉన్నాయో లేదో మెటల్ డిటెక్టర్ల ద్వారా తెలుసుకునేందుకు మనుషులకు కనీసం 4 రోజులు పడుతుంది. అందుకనే ఈ ఎలుకను ఆ పనికోసం వాడుతున్నారు. అందులో భాగంగానే మగావా ఎలుక ఇప్పటి వరకు 1,41,000 చదరపు మీటర్ల స్థలాన్ని కవర్ చేసింది. అది రెండు ఫుట్‌బాల్ మైదానాలకు సమానం.
Advertisements
Advertisements
ఇక మగావా ఎలుక అంత హెల్ప్ చేస్తున్నందుకు దానికి తాజాగా పీడీఎస్ఏ అనే సంస్థవారు గోల్డ్ మెడల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రదానం చేశారు. పీడీఎస్ఏ సంస్థ యూకేకు చెందినది. దీన్ని 1917లో స్థాపించారు. యూకేలో 48 పెట్ హాస్పిటళ్ల ద్వారా ఈ సంస్థ సేవలను అందిస్తోంది. అనారోగ్యానికి గురైన, గాయాల బారిన పడిన జీవాలకు తక్కువ ధరకే చికిత్సను అందిస్తోంది. ఇక పీడీఎస్ఏ సంస్థ 2002లో ధైర్య సాహసాలు చూపే జీవాలకు గోల్డ్ మెడల్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 30 జంతువులకు మెడల్స్ ఇచ్చారు. అవన్నీ కుక్కలే. తొలిసారిగా మగావా ఎలుకకు వీరు గోల్డ్ మెడల్‌ను ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే ఆ ఎలుకను అందరూ ప్రశంసిస్తున్నారు.