Advertisement
ఇప్పటి వరకు నేను ఎన్నో ఫొటోలు దిగాను. వాటిల్లో చాలా వరకు నా హృదయాన్ని హత్తుకున్నవే ఉన్నాయి. ఫొటో తీసుకోవాలనుకుని ప్రీ ప్లాన్డ్‌గా తీసుకున్న ఫొటోలకన్నా.. సహజసిద్ధంగా అప్పటికప్పుడు తీసుకునే ఫొటోలే నాకు బాగా నచ్చుతాయి. అలాంటి ఫొటోల్లో కింద ఇచ్చిన ఫొటో కూడా ఒకటి. ఇది ఓ భావోద్వేగపూరిత సందర్భంలో తీసిన ఫొటో. అందుకనే ఇప్పటికీ ఈ ఫొటో నా ఫొటోలన్నింటిలోనూ బెస్ట్ ఫొటో అని నాకు అనిపిస్తుంది.
ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజును నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. అప్పుడు నా కజిన్ పెళ్లి పనుల హడావిడిలో ఉన్నా. ఆ రోజు మా తాత (నాన్న తండ్రి) బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆయనకు 85 ఏళ్లు. మా నానమ్మ చనిపోయి అప్పటికి కొన్నేళ్లు అయింది. ఆ పెళ్లి హడావిడిలో ఎందుకో సడెన్‌గా తాతకు నానమ్మ గుర్తుకు వచ్చింది. ఆయన దుఃఖం ఆపుకోలేకపోయాడు. కళ్ల వెంబడి నీళ్లు గిర్రున తిరిగాయి. నేను వెంటనే ఓదార్చా. ఆయన కన్నీళ్లను తుడిచా.. అదుగో.. అప్పుడు తీసిందే ఆ ఫొటో.. ఆ ఫొటో తీసినందుకు ఆ ఫొటోగ్రాఫర్‌కు నేను ఎంతో రుణపడి ఉంటా. అలాంటి ఫొటోలు తీసుకోవడం దాదాపుగా చాలా మందికి కుదిరే పనికాదు. అలాంటివి ప్రీప్లాన్డ్‌గా తీయలేం. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. అలాంటి బెస్ట్ ఫొటోను నాకు అందించినందుకు ఆ ఫొటోగ్రాఫర్‌కు థ్యాంక్స్ చెప్పా.
Advertisement
సాధారణంగా మా ఇళ్లలో ఎవరి ఫంక్షన్లు అయినా సరే మా నానమ్మ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటుంది. మంగళకరమైన పాటలు పాడుతుంది. కానీ ఆమె లేకపోవడం మాకే కాదు, మా తాతకు కూడా బాధనిపించింది. ఏ ఫంక్షన్‌కు వెళ్లినా ఆమెను తాత గుర్తు చేసుకుని బాధ పడుతాడు. తాత, నానమ్మ ఇద్దరిదీ చూడముచ్చటైన జంట. ఇద్దరూ 60 ఏళ్లు కలిసి జీవించారు. నానమ్మ ప్రస్తుతం తాతకు దూరమై ఏళ్లు గడుస్తోంది. అది ఆయన్ను మరింత కుంగ దీస్తోంది. అయినా ఆమె మన దగ్గరే ఉందని, మన చుట్టూనే తిరుగుతుందని ఆయనకు ధైర్యం చెప్పి ఓదార్చా. వారిద్దరికీ మొత్తం 8 మంది పిల్లలు. ఇప్పుడు 21 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయినా ఆయన తన భార్యను ఇప్పటికీ తలచుకుని దుఃఖిస్తూనే ఉంటాడు. ఆమెను ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమె లేదన్న విషయాన్ని గుర్తు చేసుకుని విచారిస్తుంటాడు..!
Advertisements