Advertisement
సాధారణంగా మనం ఇండ్లలో వాడే ఏదైనా కంపెనీకి చెందిన టీ పొడి ఎంత రేటు ఉంటుంది ? 1 కేజీకి సుమారుగా రూ.500 నుంచి మొదలుకొని రూ.1000 వరకు ఉంటుంది. కొంచెం ప్రీమియం అయితే రేటు ఇంకా పెరుగుతుంది. అయితే ఆ టీ పొడి ఖరీదు ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. 1 కేజీకి ఏకంగా రూ.75వేల వరకు ఆ టీపొడికి ధర పలికింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
అస్సాంలోని గౌహతిలో ఉన్న మనోహరి టీ ఎస్టేట్ వారు ప్రత్యేకమైన టీపొడిని ఉత్పత్తి చేశారు. ఆ తేయాకులను కేవలం తెల్లవారుజామునే తెంపాల్సి ఉంటుంది. అందులోనూ అవి తక్కువగా వస్తాయి. అందువల్ల టీపొడి కూడా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే అది చాలా ప్రీమియం టీపొడి. అందుకనే దానికి ధర కూడా ఎక్కువే. ఆ టీపొడికి గౌహతి టీ ఆక్షన్ సెంటర్ (జీటీఏసీ) వేలం నిర్వహించింది. ఈ క్రమంలో ఆ టీపొడి కేజీకి రూ.75వేల ధర వచ్చింది. కాంటెంపరరీ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆ టీ పొడిని అమ్మగా దాన్ని గౌహతికి చెందిన విష్ణు టీ కంపెనీ అంత మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. విష్ణు టీ కంపెనీ ఆ టీ పొడిని 9amtea.com అనే సైట్‌లో విక్రయించనుంది. దాన్ని దేశంలోని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.
Advertisement
అయితే గతేడాది ఇదే టీపొడికి కేజీకి రూ.50వేల ధర పలకడం విశేషం. ప్రతి ఏడాది వారు 2.5 కిలోల మనోహరి గోల్డ్ స్పెషాలిటీ టీని ఉత్పత్తి చేస్తారు. కానీ అందులో 1.2 కేజీల టీ పొడిని మాత్రమే వారు వేలంలో అమ్ముతారు. ఇక గతేడాది ఆగస్టులో అస్సాంకు చెందిన డికోం టీ ఎస్టేట్ వారు గోల్డెన్ బటర్ ఫ్లై పేరిట ప్రత్యేక టీ పొడిని ఉత్పత్తి చేసి దాన్ని కేజీకి రూ.75వేల చొప్పున అమ్మారు. అలాగే ఆర్థోడాక్స్ గోల్డెన్ టీ టిప్స్ పొడి గతేడాది కేజీకి రూ.70,501 చొప్పున అమ్ముడైంది. పలు రకాల తేయాకు మొక్కలకు చెందిన లేలేత ఆకులను తెల్లవారుజామునే సేకరించి వాటితో టీ పొడి తయారు చేస్తారు. అవి చాలా అరుదైన జాతికి చెందిన మొక్కలు. అందువల్లే వాటి నుంచి తయారు చేసే టీ పొడికి అంతటి ధర పలుకుతుందని జీటీఏసీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
Advertisements