Advertisement
మన దేశంలో ఉన్న అనేక చారిత్రాత్మక, ముఖ్యమైన ఆలయాల్లో జ్వాలా జీ ఆలయం కూడా ఒకటి. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి అనే హిమాలయ టౌన్‌లో ఉంది. ఇందులో దేవి ఆది పరాశక్తిని జ్వాలా జీగా భక్తులు కొలుస్తారు. మన దేశంలో ఉన్న అత్యంత పురాతమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. మహాభారతంతోపాటు పలు ఇతర పురాణాల్లోనూ ఈ ఆలయ ప్రస్తావన ఉంది.
ఇక జ్వాలా జీ ఆలయంలో సంస్కృతం, పర్షియా భాషల్లో మనకు అనేక పురాతనమైన శాసనాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఇతర ఆలయాల మాదిరిగా విగ్రహం గానీ, ఫొటో గానీ ఉండవు. కానీ ఆలయంలోని రాళ్ల నుంచి నీలి రంగులో మంటలు వస్తుంటాయి. ఆ మంటలనే దేవి స్వరూపంగా కొలుస్తారు. ఆలయాన్ని మొదటగా నిర్మించినప్పటి నుంచి ఇప్పటికీ ఆ మంటలు అలాగే వస్తుండడం విశేషం. అవి ఇప్పటికీ ఆరిపోవడం లేదు.
ఆలయంలోని దేవిని మాతా జ్వాలా జీ, మాతా జ్వాలాముఖీ జీ అని పిలుస్తారు. గతంలో మొగల్ చక్రవర్తి అక్బర్ ఈ ఆలయంలోని మంటలను ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు. కానీ ఆ మంటలు అంతకంతకూ పెరిగాయి కానీ ఆరిపోలేదు. దీంతో విస్మయం చెందిన అక్బర్ మంటలు ఆర్పే తన ప్రయత్నాలు మానుకుని ఆలయానికి చిన్నపాటి లోహపు గొడుగును బహుకరించాడు. కానీ దాన్ని అమ్మవారు అంగీకరించలేదట. దీంతో గొడుగును అలంకరించినా అది ఎప్పటికీ కింద పడుతుండేది. ఈ క్రమంలో ఆ గొడుగును తీసి భద్రపరిచారు. దాన్ని ఆలయంలో ఇప్పటికీ చూడవచ్చు.
Advertisements
Advertisement
ఇక ఔరంగజేబు కూడా ఆలయంలో మంటలను ఆర్పేందుకు యత్నించి విఫలం అయి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యాడు. దేవి శక్తి తెలుసుకుని ఔరంగ జేబు వెనక్కి వెళ్లాడని చెబుతారు. అయితే సైంటిస్టులు మాత్రం ఆలయం కింద సహజవాయువు నిక్షేపాలు ఉండి ఉండవచ్చని, అందుకనే రాళ్లలో నుంచి నీలి రంగులో మంటలు వస్తున్నాయని, లేదా కింది భాగంలో అగ్నిపర్వతం కూడా ఉండే అవకాశం ఉందని అన్నారు.
అయితే 1970లో భారత ప్రభుత్వం ఆయా విషయాలను నిగ్గు తేల్చేందుకు ఓ విదేశీ కంపెనీకి ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించమని చెప్పింది. అయితే వారు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ.. ఆలయం కింది భాగంలో, చుట్టూ ఎక్కడా సహజ వాయువు నిక్షేపాలు లేవని, అందువల్ల ఆ మంటలకు వేరే ఏదైనా కారణం ఉండొచ్చని నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఆ మంటల విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ భక్తులు మాత్రం ఆ మంటలను సాక్షాత్తూ ఆది పరాశక్తికి ప్రతిరూపంగా భావిస్తూ పూజలు చేస్తున్నారు.
Advertisements