Advertisement
ఆఫ్గనిస్థాన్, ఇరాన్, మధ్య ఆసియాలను ఒకప్పుడు ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన తైమూర్ గురించి చాలా మందికి తెలుసు. అతను తైమూర్ వంశానికి చెందిన మొదటి పాలకుడు. క్రీస్తు శకం 14, 15 శతాబ్దాల మధ్య అతను సువిశాల రాజ్యాన్ని పరిపాలించాడు. అపజయం అంటూ ఎరుగని చక్రవర్తిగా పేరుగాంచాడు. అయితే అతని విజయాల వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని చరిత్ర చెబుతోంది. అదేమిటంటే…
తైమూర్ మొదట్లో ఏ రాజ్యంతో యుద్ధం చేసినా ఓడిపోయేవాడు. అన్నీ అపయజాలే ఎదురయ్యేవి. అలాగే ఓ సమయంలో ఓ యుద్ధంలో ఓడాక అక్కడి నుంచి వెళ్లిపోయి ఓ పురాతన భవనంలో తలదాచుకున్నాడు. అప్పుడు ఒక చీమ తన బరువు కన్నా ఎన్నో రెట్లు అధికమైన బరువు ఉన్న ఒక ధాన్యపు గింజను మోసుకుంటూ వెళ్తోంది. ఎందుకనో తైమూర్ కళ్లు దానిపై పడ్డాయి. తైమూర్ ఆ చీమను ఆసక్తిగా గమనించసాగాడు.
ఆ చీమ కొంత ముందుకు అలాగే ధాన్యపు గింజను మోసుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న గోడ ఎక్కసాగింది. అయితే అది ఎక్కినప్పుడల్లా కొంత ముందు వెళ్లి కిందకు పడిపోయేది. అయినా అది తన ప్రయత్నాన్ని మానుకోలేదు. అలా చీమ ధాన్యపు గింజను పెట్టుకుని ఎక్కడం.. కిందకు పడిపోవడం.. ఇలా కొంత సేపు జరిగింది. అయితే ఆ చీమ ఎన్ని సార్లు అలా పడిపోయిందో తైమూర్ లెక్కించాడు. 69 సార్లు చీమ కిందకు పడ్డాక.. ఆశ్చర్యంగా 70వ సారి అది విజయవంతంగా ధాన్యపు గింజను మోసుకుంటూ గోడపైకి ఎక్కి వెళ్లిపోయింది. దాన్ని చూసి తైమూర్‌కు ఇంకా ఆశ్చర్యం కలగడమే కాదు, కర్తవ్యం బోధపడింది.
Advertisements
Advertisement
Advertisements
తన శరీరానికి అన్ని రెట్లు బరువు ఉన్న ధాన్యపు గింజను ఆ చీమ మోయడమే కాక, ఏకంగా గోడపైకి అన్ని సార్లు ప్రయత్నించి ఎక్కి మరీ విజయవంతంగా ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించింది. ఆరంభంలో నిజానికి దాన్ని చూస్తే అది దానికి సాధ్యమయ్యే పనికాదనిపించింది. కానీ ఆశ్చర్యంగా ఆ చీమ అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసింది. దీంతో తైమూర్‌కు కూడా దాన్ని చూసి ప్రేరణ వచ్చింది. అక్కడి నుంచి వెళ్లిపోయి మళ్లీ యుద్ధాలను చేయడం మొదలు పెట్టాడు. పట్టు వదలకుండా ప్రయత్నం చేశాడు. చివరకు అపజయం అంటూ ఎరుగని చక్రవర్తి అయ్యాడు. ఎంతో మంది రాజులను జయించి రాజ్యాలను సొంతం చేసుకున్నాడు. అఖండ సామ్రాజ్యాన్ని పాలించాడు. తైమూర్‌కు చెందిన చరిత్ర చెప్పే వారు ఈ కథను కచ్చితంగా చెబుతారు. అతనిలా అందరూ ప్రేరణ తీసుకోవాలని అంటారు. అవును.. ఎన్ని అపజయాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రయత్నం చేస్తే.. కచ్చితంగా ఏదో ఒక రోజు విజయం వరిస్తుంది.