Advertisement
ప్రపంచ వ్యాప్తంగా అనేక జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అనేక మంది గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటుంటే.. కొందరు మాత్రం తెగలుగా ఏర్పడి అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అలాంటి భిన్న తెగలకు చెందిన వారు తమదైన ఆచార వ్యహారాలు, సాంప్రదాయాలను కూడా పాటిస్తుంటారు. వారిలో కొందరు నాగరికతకు దూరంగా కూడా ఉంటారు. అలాంటి పలు తెగలు, వారికి సంబంధించిన ఆసక్తికరమైన సాంప్రదాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. హింబా (Himba)
వీరు ఉత్తర నమీబియా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ తెగకు చెందిన వారి సంఖ్య ప్రస్తుతం 50వేలుగా ఉంది. ఈ తెగకు చెందిన మహిళలు మేక తోలుతో తయారు చేసిన లెదర్‌ను ధరిస్తారు. అలాగే పాల కొవ్వు, ఒక్రె అనే పదార్థాలతో తయారు చేయబడిన మిక్చర్‌ను చర్మం, వెంట్రుకల రక్షణకు ధరిస్తారు. దీంతో వేడి నుంచి చర్మానికి రక్షణ లభిస్తుందని వారు నమ్ముతారు. ఇక వీరి వెంట్రుకలు వినూత్న రీతిలో ఉంటాయి. అక్టోపస్‌కు ఉండే టెంటకిల్స్ మాదిరిగా జుట్టు ఉంటుంది. వీరు పోరిడ్జ్ అనబడే వంటకాలను ఎక్కువగా తింటారు.
2. సెంటినలీస్ (Sentinelese)
Advertisements
అండమాన్ నికోబార్ దీవుల పరిధిలోని ఉత్తర సెంటినల్ ద్వీపంలో సెంటినలీస్ నివసిస్తారు. వీరి సంఖ్య ప్రస్తుతం కేవలం 50 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని రాతి యుగానికి చెందినవారుగా చెబుతారు. వీరు గత 60వేల ఏళ్ల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. వీరు దుస్తులు ధరించరు. కానీ మెడలో తమ పూర్వీకులకు చెందిన దవడ ఎముకలను ధరిస్తారు. వీరు ఇతరులెవరనీ తమ స్థావరాల్లోకి అనుమతించరు. ఇతరులు కనిపిస్తే వెంటపడి మరీ చంపుతారు. 2018లో పలువురు హెలికాప్టర్ ద్వారా వీరి ప్రాంతంపై సంచరించగా.. వారిపై సెంటినలీస్ పొడవైన ఈటెలతో దాడి చేశారు. అయితే కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే సెంటినలీస్‌తో చాలా రోజులు ఉన్నట్లు చెబుతారు. కానీ అతని వివరాలు పూర్తిగా తెలియవు.
3. డొగొన్ (Dogon)
వీరు మాలి, బుర్కినా ఫాసో ప్రాంతాల్లో నివాసం ఉంటారు. బండియాగారా ఎస్కార్ప్‌మెంట్ అనే ఏరియాలో సుమారుగా 150 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే కొండ ప్రాంతంలో వీరు ఎక్కువగా నివాసం ఉంటారు. వీరు గ్రామాలను నిర్మిస్తుంటారు. తమదైన భాషలో మాట్లాడుతారు. అది నైజర్, కాంగో భాషలను పోలి ఉంటుంది. వీరు చెక్కతో అందమైన కళాకృతులు చేస్తారు. మాస్కులు తయారు చేస్తారు. అలాగే తమదైన ప్రత్యేక నాలెడ్జి వీరికి పలు అంశాల్లో ఉంటుంది.
4. అయిను (Ainu)
రష్యా, హొక్కడొ, జపాన్ దేశ ప్రాంతాల్లో వీరు నివాసం ఉంటారు. వీరు ఎక్కువగా వేటపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ప్రకృతి దేవతలను పూజిస్తారు. వీరికి జన్యుపరంగా ప్రస్తుత ఆధునిక నాగరిక సమాజంలో ఏ జాతికి చెందిన మనుషులతోనూ దగ్గరి సంబంధాలు లేవు.
5. చంబ్రి (Chambri)
Advertisement
పపువా న్యూ గినియాలో వీరు నివాసం ఉంటారు. వీరు వర్తకం, చేపలు పట్టడం ద్వారా జీవిస్తారు. అక్కడి సెపిక్ అనబడే నదీ ప్రాంతంలో వీరు ఎక్కువగా కనిపిస్తారు. వీరు నదిలో మొసళ్లను పట్టుకుని వాటితో పండుగ ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ జాతికి చెందినవారిలో మగవారు నిర్దిష్టమైన వయస్సుకు వచ్చాక వారి వీపు, ఛాతి భాగాల్లో మత్తుమందు ఇవ్వకుండానే గాట్లు పెట్టి మొసళ్ల చర్మాన్ని అమరుస్తారు.
6. కజఖ్స్ (Kazakhs)
వీరు మంగోలియాలో నివాసం ఉంటారు. వేటాడడం ద్వారా జీవనం సాగిస్తారు. వేటాడడం వీరి పూర్వీకుల నుంచి సాంప్రదాయంగా వస్తోంది. అందుకు గాను వీరు పక్షులను ఉపయోగిస్తారు.
7. కలాష్ (Kalash)
పాకిస్థాన్‌లోని చిత్రల్ వ్యాలీలో వీరు నివసిస్తారు. వీరు హిందూ ధర్మాన్ని పోలిన ఆచారాలు, సాంప్రదాయాలను పాటిస్తారు. మహిళలు కాంతివంతమైన వస్త్రాలను ధరిస్తారు. తమదైన శైలిలో ఉత్సవాలను జరుపుకుంటారు. బాలురను వీరు వేసవిలో కేవలం మేకలతోనే జీవించాలని చెప్పి పంపిస్తారు. వీరు తమదైన ప్రత్యేక ఆచారాలు, సాంప్రదాయాలను కూడా పాటిస్తారు.
8. పిరాహా (Piraha)
వీరు దక్షిణ అమెరికాలో నివాసం ఉంటారు. అమెజాన్ నదీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తారు. వీరు పిరాహా భాషలో మాట్లాడుకుంటారు. వీరికి దైవం అంటూ లేదు. లీడర్లు కూడా ఎవరూ ఉండరు. ఎవరికి వారు స్వతంత్రంగా జీవిస్తారు. వీరి భాషలో కేవలం 3 అచ్చులు, 8 హల్లులు మాత్రమే ఉంటాయి. ఎక్కువగా ఈలలు వేయడం, ప్రత్యేకమైన ధ్వని చేయడం ద్వారానే వీరు మాట్లాడుకుంటారు. వీరి భాషలో పదాలు, నంబర్లు ఉండవు.
9.బజౌ (Bajau)
వీరు మలేషియా ప్రాంతంలో ఎక్కువగా నివాసం ఉంటారు. వీరు చిన్న చిన్న గ్రూపులుగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తుంటారు. చిన్నపాటి గ్రామాలను నీటిపై నిర్మించుకుంటారు. వీరు చేపలను ఎక్కువగా తింటారు. వీరి జీవనశైలి వల్ల వీరు ఏకబిగిన 5 గంటల పాటు నీటిలోపల ఉండగలుగుతారు. అలాగే నీళ్లలో ఊపిరి తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండగలరు. రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఎక్కువైనా వీరికి ఏమీ కాదు. అలాగే సాధారణ వ్యక్తుల కన్నా వీరి శరీరంలో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
10. నాగా (Naga)
మయన్మార్ దేశంలో వీరు ఎక్కువగా నివసిస్తారు. అలాగే ఈశాన్య భారతదేశంలోనూ వీరు నివాసం ఉంటారు. వీరు రంగు రంగుల ఆభరణాలను ఎక్కువగా ధరిస్తారు. ఏనుగు దంతాలు, సముద్రపు శంఖులు, ఎముకలు తదితర భిన్న రకాల ఆభరణాలను ధరిస్తారు. వీరు 90 భాషలు మాట్లాడగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు పలు రకాల పురుగులను కూడా తింటారు.
Advertisements