Advertisement
సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు తమకు న్యాయం జరుగుతుందా ? అని కొన్ని సార్లు అనుకోవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తాము బలహీన వర్గాలకు చెందినవారం కదా, పేదవాళ్లం.. తమకు న్యాయం చేస్తారా.. పోరాడితే న్యాయం జరుగుతుందా.. అని కొందరు అనుకుంటారు. కానీ పోరాటం అంటూ చేస్తే తప్పక న్యాయం జరుగుతుంది. అందుకు ఆ చిన్నారే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు.
ఒడిశాలోని కేంద్రపారాకు చెందిన 6వ తరగతి చదువుతున్న ఓ బాలిక తన తండ్రిపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా 10 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లింది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. కరోనా లాక్‌డౌన్ నుంచి కేంద్రం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రోజుకు 150 గ్రాముల బియ్యం అందిస్తోంది. అలాగే రోజుకు రూ.8 చొప్పున నెలకు రూ.240 చిన్నారులకు అందిస్తోంది. ఈ క్రమంలో ఆ మొత్తాన్ని కేంద్రం వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది.
Advertisement
అయితే ఆ బాలిక మాత్రం తనకు ఏవీ రావడం లేదని, ఆ మొత్తాన్ని తన తండ్రి తీసుకుంటున్నాడని ఆమె కలెక్టర్ సమరత్ వర్మకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ఆయన వెంటనే చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇకపై బియ్యం, డబ్బు ఆ బాలికకే వచ్చేట్లు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ బాలిక అక్కడి నుంచి సంతోషంగా వెళ్లిపోయింది. అవును.. ఆమెది చిన్న వయస్సే. తన తండ్రి రూపంలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పాలో వారికి చెప్పింది. అందుకు ఆమె భయపడలేదు. తనకు దక్కాల్సిన ప్రయోజనాలను కష్టపడి సాధించుకుంది. నిజంగా ఆ బాలికను అందరూ ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎవరైనా సరే.. తమకు న్యాయం జరిగే వరకు పోరాడ వచ్చని ఆ బాలికకు ఎదురైన అనుభవమే మనకు చెబుతోంది..!
Advertisements