Advertisement
కంప్యూటర్లను వాడేవారందరికీ వాటి గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కంప్యూటర్లను తీసుకునేటప్పుడు సహజంగానే చాలా మందికి ఇంటెల్ కోర్ ఐ3, ఐ5, ఐ7 ప్రాసెసర్ల గురించి తెలుస్తుంటుంది. అవి ఉన్న కంప్యూటర్లనే చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రాసెసర్ల తయారీలో ఇంటెల్ కూడా ఎంతగానో పేరుగాంచింది. అయితే ఇంతకీ అసలు కోర్ ఐ3, ఐ5, ఐ7 అంటే ఏమిటి ? వీటి వల్ల ఏం జరుగుతుంది ? ప‌్రాసెసర్లకు ఆ పేరు ఎందుకు పెట్టారు ? అంటే…
కంప్యూటర్లలో ఉండే ప్రాసెసర్లలో కోర్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. సింగిల్, డ్యుయల్ కోర్, క్వాడ్‌కోర్, హెగ్జా, ఆక్టాకోర్.. ఉంటాయి. కోర్ సంఖ్య పెరిగే కొద్దీ ప్రాసెసర్ ప్రదర్శన మెరుగ్గా ఉంటుందన్నమాట. అంటే డ్యుయల్ కోర్ కన్నా క్వాడ్ కోర్ ప్రాసెసర్ మెరుగ్గా పనిచేస్తుంది. దాని కన్నా ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇంకా మెరుగైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ క్రమంలోనే కోర్స్ ఎక్కువగా ఉండే ప్రాసెసర్‌లనే చాలా మంది కంప్యూటర్ల కోసం ఎంపిక చేసుకుంటుంటారు.
అయితే ఆ కోర్ పేరునే ఇంటెల్ సంస్థ తాను తయారు చేసే ప్రాసెసర్లకు పెట్టింది. ఇక ఐ అంటే ఇంటెల్ అని అర్థం. ఐ సిరీస్ అని కూడా అర్థం వస్తుంది. ఐ3, ఐ5, ఐ7 అంటే ప్రత్యేకంగా అర్ధాలు ఏమీ లేవు. కానీ ఐ3 కన్నా ఐ5 సిరీస్ ప్రాసెసర్లు వేగంగా పనిచేస్తాయి. వాటి కన్నా ఐ7 మరింత వేగంగా ఉంటుంది. ఇక ఇటీవలి కాలంలో ఐ9 ప్రాసెసర్లు కూడా వచ్చాయి. ఇవి ఐ7 కన్నా మెరుగ్గా పనిచేస్తాయి. అంటే నంబర్ పెరిగే కొద్దీ ప్రాసెసర్ల పనితీరు మెరుగ్గా ఉంటుందన్నమాట. అందుకనే వినియోగదారులు తమకు నచ్చిన, బడ్జెట్‌లో వచ్చే ప్రాసెసర్లు కలిగిన కంప్యూటర్లను కొనుగోలు చేస్తుంటారు.
Advertisement
ఇక ఐ3 ప్రాసెసర్లు ఉండే కంప్యూటర్లు సహజంగానే బేసిక్ అవసరాల కోసం పనిచేస్తాయి. ఐ5 ప్రాసెసర్ ఉండే పీసీలు మల్టీ టాస్కింగ్, కొంచెం హెవీ వర్క్‌కు పనిచేస్తాయి. ఐ7, ఐ9 ప్రాసెసర్లు ఉండే కంప్యూటర్లు 3డీ గేమింగ్, గ్రాఫిక్స్ చేయడానికి, వీడియో ఎడిటింగ్, భారీ స్థాయిలో పనులు చేయడానికి పనికొస్తాయి. అందుకనే వాటి రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఐ3 ప్రాసెసర్ ఉండే కంప్యూటర్ల ధరలు రూ.35వేల లోపు ఉంటాయి. ఐ5 అయితే రూ.40వేల నుంచి రూ.55వేల మధ్య లభిస్తాయి. అదే ఐ7 అయితే రూ.65వేల పైన ఉంటాయి. ఐ9 అయితే రూ.1 లక్ష పైన ఉంటాయి. ఇలా ఎవరి అవసరాలకు తగినట్లు వారు ఆయా ప్రాసెసర్లు కలిగిన పీసీలను కొంటుంటారు. అందుకు బడ్జెట్ కూడా నిర్ణయించుకుంటారు.
Advertisements
అయితే ఆయా ప్రాసెసర్లకు జనరేషన్‌లు కూడా ఉంటాయి. అంటే.. తాజాగా విడుదలైన ఇంటెల్ ప్రాసెసర్లు 10వ జనరేషన్‌వి. అంటే లేటెస్ట్‌వి అన్నమాట. దాన్ని బట్టి మనం ప్రాసెసర్లు కొత్తవా, పాతవా, ఎప్పుడు విడుదలయ్యాయి.. అన్న వివరాలను తెలుసుకోవచ్చు. సహజంగానే యాపిల్ కంపెనీ ఏడాదికొక సారి కొత్త ఐఫోన్లను విడుదల చేసినట్లు ఇంటెల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త సిరీస్‌లో నూతన జనరేషన్‌లతో ప్రాసెసర్లను ఉత్పత్తి చేసి విడుదల చేస్తుంటుంది. జనరేషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సిరీస్ అన్నమాట. అది.. ప్రాసెసర్ కొత్తదా, పాతదా అని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఇక ఇంటెల్ ప్రాసెసర్ నంబర్లను చూసి అది ఏ జనరేషన్ ప్రాసెసర్ అనేది తెలుసుకోవచ్చు. ఉదాహరణకు.. ప్రాసెసర్ నంబర్ 9800 అని ఉందనుకుందాం. అందులో మొదటి నంబర్ జనరేషన్‌ను సూచిస్తుంది. అంటే.. అది 9వ జనరేషన్ ప్రాసెసర్ అన్నమాట. అదే ప్రాసెసర్ నంబర్ 8800 అని ఉంటే అది 8వ జనరేషన్ ప్రాసెసర్ అని అర్థం. ఇలా ప్రాసెసర్ల జనరేషన్‌లను తెలుసుకోవచ్చు. దీంతో ప్రాసెసర్లు లేటెస్ట్‌వేనా, కాదా అన్న విషయం మనకు ఇట్టే సులభంగా తెలిసిపోతుంది.
Advertisements