Advertisement
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనేక నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యం ఏటా పెరిగిపోతోంది. పారిశ్రామికీకరణ ఎక్కువగా జరుగుతుండడం, నిత్యం రహదారుల పైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతుండడం.. వంటి అనేక కారణాల వల్ల గాలి కాలుష్యం తీవ్రత ఎక్కువవుతోంది. మన దేశంలో ఢిల్లీలో ఏటా ఈ సమస్య అధికమవుతోంది. అయితే అక్కడ కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు ఏకంగా ఓ భారీ ఎయిర్ ప్యూరిఫైర్‌ను ఏర్పాటు చేశారు.
ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో ఈ ఏడాది జనవరిలో ఓ భారీ ఎయిర్ ప్యూరిఫైర్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటాలు కలిసి అభివృద్ధి చేశాయి. ఈ టవర్ 20 అడుగుల పొడవు ఉంటుంది. ఇది రోజుకు 6 లక్షల క్యుబిక్ మీటర్ల గాలిని శుభ్రం చేయగలదు. గాలిలో ఉండే దాదాపుగా 75 శాతం వరకు పీఎం 2.5, 10 కాలుష్య కారకాలను ఈ ప్యూరిఫైర్ ఫిల్టర్ చేసి నగరవాసులకు శుభ్రమైన, స్వచ్ఛమైన గాలిని అందజేస్తుంది.
Advertisement
ఈ టవర్‌లో అధునాతన కార్బన్ నానో ఫైబర్ ఫిల్టర్లు ఉంటాయి. అందువల్ల ఈ టవర్ గుండా వెళ్లే గాలి స్వచ్ఛంగా మారుతుంది. దీంతో గాలిలో కాలుష్యం తీవ్రత తగ్గుతుంది. అయితే ఢిల్లీలో ప్రతి ఏటా చలికాలంలో కాలుష్యం తీవ్రత మరింత పెరుగుతుంది. దీంతో ఈ సారి టవర్లను మరిన్ని ఉపయోగించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Advertisements
Advertisements
కాగా చైనాలోనూ ఇలాంటి స్మాగ్ టవర్స్ రెండు ఉన్నాయి. ఒకటి చైనా రాజధాని బీజింగ్‌లో ఉండగా, మరొకటి ఉత్తరాది నగరం షియాన్‌లో ఉంది. షియాన్‌లో ఉన్న స్మాగ్ టవర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ ఫ్యూరిఫైర్‌గా రికార్డు సృష్టించింది. ఇది తన చుట్టూ 6 చదరపు కిలోమీటర్ల దూరంలో ఉండే గాలి మొత్తాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. దీని ఎత్తు సుమారుగా 100 మీటర్ల (328 అడుగులు) ఉంటుంది. గాలిలోని పీఎం 2.5 కాలుష్య కారకారలను ఈ టవర్ ఫిల్టర్ చేస్తుంది. రోజుకు 1 కోటి క్యుబిక్ మీటర్ల గాలిని ఇది స్వచ్ఛంగా మారుస్తుంది. అయితే నగరాల్లో కాలుష్యాన్ని కొంత వరకు తగ్గించేందుకు స్మాగ్ టవర్లు ఉపయోగపడినా.. వాటి వల్ల సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదని, సహజసిద్ధంగా కాలుష్యాన్ని తగ్గించే యత్నం చేయాలని పర్యావరణ వేత్తలు అంటున్నారు.