Advertisement
మన దేశంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అజమాయిషీ చెలాయిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్‌బీఐ మన దేశ ప్రభుత్వ బ్యాంకు. ఆ బ్యాంకు ఇతర బ్యాంకులకు, ప్రభుత్వాలకు రుణాలు ఇస్తుంది. డబ్బు ఎంత ప్రింట్ కావాలన్నది నిర్ణయిస్తుంది. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఆర్‌బీఐకి చెందిన చిహ్నం ఎప్పుడైనా చూశారా ? అందులో ఉన్న బొమ్మల అర్థాలు ఏమిటంటే..?
ఆర్‌బీఐ చిహ్నంలో ఒక పులి, దాని వెనుక ఒక పామ్ ట్రీ ఉంటాయి. ఇక పై భాగంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో రాసి ఉంటుంది. కింది వైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లిష్‌లో రాసి ఉంటుంది. వీటన్నింటి చుట్టూ రెండు వృత్తాలు ఉంటాయి. ఒక వృత్తం సన్నని గీతతో, మరొక వృత్తం లావుపాటి గీతతో ఉంటాయి.
Advertisement
అయితే ఆర్‌బీఐ చిహ్నంలో ఉన్న పులి రాయల్ బెంగాల్ టైగర్. మన జాతీయ జంతువు. ఒకప్పుడు.. అంటే.. క్రీస్తు పూర్వం 25వ శతాబ్దంలో ఈ పులి చిహ్నాన్ని సింధు లోయ నాగరికత ప్రజలు ఉపయోగించారు. వారు ఉపయోగించిన పశుపతి ముద్రపై ఈ పులి బొమ్మ కనిపిస్తుంది. తరువాత అదే పులి చిహ్నాన్ని క్రీస్తు శకం 300 నుంచి 1279 సంవత్సరాల మధ్య చోళులు తమ ముద్రల్లో ఉపయోగించారు. ఈ క్రమంలో దాన్ని ఆర్‌బీఐ చిహ్నంలోనూ వాడడం మొదలు పెట్టారు. ఆ పులి దృఢత్వానికి, చురుకు దనానికి నిదర్శనం. మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా అలాగే ముందుకు కొనసాగాలని ఆ పులి చిహ్నాన్ని ఆర్‌బీఐ ముద్రలో ఉపయోగిస్తున్నారు.
ఇక పులి వెనుక ఉన్న చెట్టు ప్రకాశిస్తున్న సూర్యుడు, నక్షత్రాలను సూచిస్తుంది. నిజాయితీ, విలువలను కలిగి ఉండడం, రక్షణ ఇవ్వడాన్ని సూచిస్తుంది. కాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనే దేవనాగరి లిపిలో ఉన్న అక్షరాలను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లిష్ అక్షరాలను అమెరికాకు చెందిన ఓజ్‌వాల్డ్ బ్రూస్ కూపర్ అనే వ్యక్తి 1919లో డిజైన్ చేసిన కూపర్ ఓల్డ్ స్టైల్ బోల్డ్ అక్షరాలను పోలి ఉండేలా రూపొందించారు. చివరిగా వృత్తాల విషయానికి వస్తే.. అవి తమ లోపల ఉన్న వాటిని రక్షించే విషయాన్ని సూచిస్తాయి. ఇలా ఆర్‌బీఐ లోగోకు అర్థాలు వస్తాయి.
Advertisements
Advertisements