Advertisement
నిత్యం మనకు వార్తల్లో ఎక్కడ చూసినా కనిపించే పదాల్లో జీడీపీ (GDP) కూడా ఒకటి. దీన్నే తెలుగులో స్థూల జాతీయోత్పత్తి అని కూడా అంటారు. అయితే నిజానికి ఇంతకీ అసలు జీడీపీ అంటే ఏమిటి ? ఇది ఎందుకంత ముఖ్యమైంది ? దీని వల్ల మనకు ఏం జరుగుతుంది ? అంటే.. క్లుప్తంగా ఓ చిన్న ఇడ్లీ కథ రూపంలో దీని గురించి తెలుసుకుందాం.
ఉదాహరణకు ఏబీసీ అనే ఒక దీవి ఉందనుకుందాం. అందులో ఒక రైతు, కిరాణా సరుకులు అమ్మే వ్యాపారి, ఇడ్లీలు అమ్మే అతను, ఎరువులు తయారీ చేసే అతను.. కేవలం నలుగురు మాత్రమే ఉన్నారనుకుందాం. ఎరువులు తయారు చేసే అతను ఎరువులను రైతుకు అమ్ముతాడు. రైతు తాను పండించే బియ్యం, మెంతి ఆకులు, మినపప్పు తదితరాలను కిరాణా వ్యాపారికి అమ్ముతాడు. కిరాణా వ్యాపారి వాటితోపాటు నూనెను ఇతర దీవి నుంచి దిగుమతి చేసుకుని ఆ మొత్తం సరుకులను ఇడ్లీలు అమ్మే అతనికి విక్రయిస్తాడు. అలాగే కిరాణా వ్యాపారి తన వద్ద మిగిలి ఉన్న మెంతి ఆకులను ఇతర దీవికి ఎగుమతి చేస్తాడనుకుందాం. ఇక ఇడ్లీలు తయారు చేసే అతను కిరాణా వ్యాపారి నుంచి ఆ సరుకులను కొని వాటితో ఇడ్లీలను తయారు చేసి విక్రయిస్తాడు. వాటిని రైతు కొంటాడనుకుందాం.
ఇక ఆ దీవిలో జరిగిన మొత్తం లావాదేవీలను ఒక్కసారి లిస్ట్ రూపంలో పరిశీలిస్తే…
పైన తెలిపిన జాబితా ప్రకారం మన ఆ దీవి జీడీపీ తెలుసుకోవచ్చు. అందుకు గాను ఆ దీవిలో పూర్తిగా తయారైన వస్తువులు, అందించిన సేవలకు గాను అయిన విలువను కలిపి లెక్కించాలి. ఆ లిస్ట్‌లో బియ్యం, మెంతి ఆకులు, మినప పప్పు, వంటనూనెలను మధ్యస్థ వస్తువులు అంటారు. ఎందుకంటే అవి చివరి ఉత్పత్తులు కావు. వాటితో ఇడ్లీలను తయారు చేశాడు. కనుక ఇడ్లీ చివరి ఉత్పత్తి అవుతుంది. అలాగే ఎరువు కూడా చివరి ఉత్పత్తి అని చెప్పవచ్చు. ఇక కిరాణా వ్యాపారి మెంతి ఆకులను ఎగుమతి చేసి వంట నూనెను దిగుమతి చేసుకున్నాడు. కనుక వీటిని జీడీపీని లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకోవాలి. పైన తెలిపిన ఇడ్లీ, ఎరువులు, మెంతి ఆకుల విలువలను కలిపి అందులోంచి దిగుమతి చేసుకోబడిన వంట నూనె విలువను తీసేయాలి. దీంతో జీడీపీ వస్తుంది. అంటే..
Advertisements
Advertisement
Advertisements
ఇడ్లీ విలువ ప్లేట్ రూ.100, ఫెర్టిలైజర్ విలువ రూ.100, మెంతి ఆకుల విలువ రూ.72 అనుకుంటే వీటిని కలపాలి. వంటనూనె విలువ రూ.90 అనుకుంటే దాన్ని తీసేయాలి. ఈ క్రమంలో 100 + 100 + 72 – 90 = 182 అవుతుంది. ఇదే ఆ దీవి జీడీపీ అన్నమాట.
అయితే జీడీపీ ఎక్కువ ఉంటే ఆ దీవి వృద్ధి చెందినట్లు. తగ్గితే.. ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నట్లు లెక్క. ఈ క్రమంలో జీడీపీ వృద్ధికి ఆ దీవిలో స్థానికంగా వస్తువుల ఉత్పత్తి, వినియోగం పెరగాలి. సేవల వినియోగం కూడా ఎక్కువ కావాలి. అదే ఇడ్లీ వ్యాపారి అమ్మే ఇడ్లీలను రైతు కొనకపోతే.. అప్పుడు ఆ దీవి జీడీపీపై తీవ్ర ప్రభావం పడుతుందన్నమాట. ఇదీ అసలు కథ. అంటే ఉత్పత్తి అయ్యే వస్తువులతోపాటు సేవల వినియోగం కూడా ఎక్కువ కావాలి. అదే సమయంలో దిగుమతులు తగ్గాలి. ఎగుమతులు పెరగాలి. దీంతో జీడీపీ పెరుగుతంది. దీవి వృద్ధిలోకి వస్తుంది. సరిగ్గా ఇదే సూత్రం ప్రతి దేశానికీ వర్తిస్తుంది. అందుకనే ప్రధాని మోదీ మేడిన్ ఇండియా క్యాంపెయిన్ చేపట్టారు.
ఇక పైన తెలిపిన వివరాల్లో రెండు ముఖ్యమైన విషయాలను చెప్పకుండా వదిలేశాం. ఒకటి ప్రభుత్వం ఖర్చులు, రెండు పెట్టుబడులు. ఇవి కూడా జీడీపీలో భాగమే. అలాగే ఎరువుల తయారీ కంపెనీకి సప్లై అయ్యే ముడి పదార్థాలను కూడా పైన వదిలేశాం. అవి కూడా లెక్కలోకి రావాలి. కానీ జీడీపీ గురించి సులభంగా తెలుసుకునేందుకు వాటిని వదిలేయడం జరిగింది. నిజానికి ఆయా అంశాలు కూడా జీడీపీ గణనలోకి వస్తాయి. అందువల్ల దేశాలు వృద్ధి చెందాలంటే జీడీపీ పెరగడం అత్యవసరం.