Advertisement
మనకు వార్తల్లో తరచూ హవాలా అనే పేరు వినిపిస్తుంటుంది. పోలీసులు హవాలా సొమ్మును సీజ్ చేశారని, హవాలా రాకెట్ నడిపే వ్యక్తులను అరెస్టు చేశారని.. మనం అప్పుడప్పుడు వార్తలు వింటుంటాం, చదువుతుంటాం.అయితే ఇంతకీ అసలు హవాలా అంటే ఏమిటి ? ఇందులో ఏం జరుగుతుంది ? హవాలా సొమ్ము అంటే ఏమిటి ? దీని వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం మన దేశంలో ఉన్న ఎవరికైనా సొమ్మును పంపాలంటే వారికి నేరుగా నగదు ఇస్తాం.. లేదా ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ లో ట్రాన్స్ ఫర్ చేస్తాం. అలా కూడా కాకపోతే చెక్ ఇస్తాం. దాన్ని వారు బ్యాంకులో మార్చుకుంటారు. ఈ పద్ధతులు అందరికీ తెలిసినవే. అదే విదేశాల్లో ఉన్నవారికి డబ్బును పంపాలంటే మనం వెస్టర్న్ యూనియన్ లాంటి ఏజెన్సీలను ఆశ్రయించాలి. అంటే ఉదాహరణకు మీ స్నేహితుడు అమెరికాలో ఉన్నాడనుకుందాం. అతనికి మీరు మీ వద్ద ఉన్న రూ.10 లక్షలను డాలర్లలోకి మార్చి పంపాలి. ఆ మొత్తం డాలర్లలో అయితే 13,573 డాలర్లు అవుతుంది. ఈ క్రమంలో ఆ ఏజెన్సీలు కొంత రుసుం తీసుకుని ఆ మొత్తాన్ని అమెరికాలో ఉన్న మీ స్నేహితుడికి పంపుతాయి. అతను అక్కడ తనకు సమీపంలో ఉండే అదే ఏజెన్సీ నుంచి డబ్బును తీసుకుంటాడు. ఇదంతా చట్టపరంగా జరుగుతుంది.
అయితే పైన తెలిపిన విధంగా మొత్తాన్ని పంపాలంటే.. కొంత మొత్తం అయితే ఏమీ కాదు. కొంత రుసుం చెల్లిస్తే డబ్బును విదేశాలకు పంపవచ్చు. కానీ భారీ మొత్తం అయితే.. చార్జిలు కూడా భారీగా అవుతాయి. అలాగే ఆ మొత్తం మీకు ఎలా వచ్చిందో లెక్క చూపాలి. లేదంటే బ్లాక్ మనీ కింద లెక్కగట్టి ఆ మొత్తాన్ని సీజ్ చేస్తారు. దీంతో భారీ మొత్తంలో డబ్బును విదేశాలకు పంపడం కుదరదు. సరిగ్గా ఇక్కడే హవాలా అలాంటి వ్యక్తులకు మేలు చేస్తుంది.
Advertisement
భారీ మొత్తంలో సొమ్మును చాలా తక్కువ రుసుముతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపేందకు హవాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా మీరు ఇండియాలో ఉండే ఓ అమెరికన్‌కు రూ.10 లక్షలు ఇస్తారు. దాన్ని అతను నేరుగా అమెరికాలో ఉండే మీ ఫ్రెండ్‌కు పంపడు. అక్కడ తనకు తెలిసిన ఓ ఫ్రెండ్‌కు చెప్పి అతని ద్వారా అతని వద్ద ఉన్న ఆ మొత్తాన్ని మీ ఫ్రెండ్‌కు పంపిస్తాడు. దీంతో డబ్బు తేలిగ్గా చేతులు మారుతుంది. ఇక ఈ విధానంలో డబ్బు ఒక దేశం నుంచి మరొక దేశానికి ట్రాన్స్‌ఫర్ జరగడం ఉండదు. ఎక్కడికక్కడే అంతా సెటిల్ అవుతుంది. దీన్నే హవాలా రాకెట్ అంటారు.
Advertisements
చట్టపరంగా డబ్బును ఒక దేశం నుంచి మరొక దేశం దాటిస్తే చార్జిలు బాగా పడతాయి. పైగా ఆ డబ్బు ఎలా వచ్చిందో చెప్పాల్సి ఉంటుంది. కానీ హవాలా అయితే ఈ ఇబ్బంది ఉండదు. కొంత మొత్తంలో కమిషన్ చెల్లిస్తే చాలు హవాలా చేసే వారు మన డబ్బును విదేశాల్లో ఉన్న మనవారికి సులభంగా పంపిస్తారు. దీంతో మనకు లాభమే. కానీ ఇలా చేయడం చట్టపరంగా నేరం. దేశాల ఆదాయానికి గండి పడుతుంది. కనుకనే హవాలా రాకెట్ నడిపేవారిని అరెస్టు చేస్తారు. వారి వద్ద ఉండే హవాలా సొమ్మును సీజ్ చేస్తారు. అయితే హవాలా రాకెట్‌ను నిర్దిష్టమైన దేశానికి చెందిన వారే నడపాలని ఏమీ లేదు. ఒక దేశంలో ఉండే ఎవరైనా సరే.. మరో దేశంలో తమకు తెలిసిన వారు ఉంటే వారి ద్వారా హవాలా నడపవచ్చు. హవాలా విధానంలో దేశాల మధ్య నగదు ట్రాన్స్‌ఫర్ జరగదు. కనుక దాన్ని ట్రేస్ చేయడం కూడా కష్టమే. లోలోపల తతంగం పూర్తవుతుంది. హవాలా రాకెట్ నడిపే వారిని గుర్తించడమూ కష్టమే. ఇక దీని వల్ల పెద్ద ఎత్తున బ్లాక్ మనీ విదేశాలకు తరలిపోతుంది. ఆ డబ్బును మళ్లీ స్వదేశానికి రప్పించడం చాలా కష్టతరమవుతుంది. అందుకనే హవాలా రాకెట్ ముఠాలను పోలీసులు ఎప్పటికప్పుడు ట్రేస్ చేసి అరెస్టు చేస్తుంటారు.
Advertisements