Advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఎల్ఆర్ఎస్ స్కీంను ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఇందుకు గాను 131 జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎల్ఆర్ఎస్ రుసుం ఎక్కువగా ఉందని ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో నిలదీయడంతో ప్రభుత్వం 2015 సంవత్సరం నాటి మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ రుసుం తీసుకుంటామని తెలిపింది. దీనికి గాను తెలంగాణ ప్రభుత్వం 131 జీవోను సవరించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటి ? ఇది ఎందుకు కావాలి ? కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయి ? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
LRS అంటే లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం. అంటే.. అనుమతి లేని, అక్రమ లే అవుట్‌లలోని ప్లాట్లను ఎల్ఆర్ఎస్ స్కీంలో భాగంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇందుకు గాను ప్లాట్ మార్కెట్ విలువలో కొంత మొత్తాన్ని రుసుంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేస్తారు. తరువాత ప్లాట్ క్రమబద్దీకరణ అయినట్లు లెక్క. అంటే అనుమతి లేని, అక్రమ లే అవుట్‌లోని ప్లాట్ అయినప్పటికీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది కనుక.. అది సక్రమమం అవుతుందన్నమాట. దీంతో ఆ ప్లాట్‌కు అధికారిక పత్రాలు వస్తాయి. వాటి ఆధారంగా ఆ ప్లాట్‌ను అమ్ముకోవచ్చు. లేదా డెవలప్ చేసుకోవచ్చు. లోన్ తీసుకోవచ్చు.
LRS లేని ప్లాట్లను అమ్మడం, కొనడం కుదరదు. వాటికి లోన్లు కూడా ఇవ్వరు. కనుక ఎల్ఆర్ఎస్ చేయించుకుంటే పైన తెలిపిన విధంగా లాభం కలుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అలాంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టింది.
Advertisement
ఎల్ఆర్ఎస్ కింద 2020, ఆగస్టు 26వ తేదీకి ముందు వరకు సేల్ డీడ్ చేయించుకున్న అక్రమ లే అవుట్‌లలోని ప్లాట్లకు నిర్దిష్ట మొత్తం జరిమానా చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు. దీనికి అక్టోబర్ 15, 2020 వరకు గడువు ఉంది. ఎల్ఆర్ఎస్ కింద భూ యజమానులు, ప్రైవేట్ డెవలపర్స్, ఇతర సంస్థలు తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అయితే నీటి ముంపు ఉండే ప్రాంతాలు, నదులు, నాలాలు, కాలువలు తదితర ప్రాంతాల్లోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలోని లే అవుట్స్, ప్లాట్లను మాత్రం ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్దీకరించరు. ఆ విషయాన్ని గుర్తుంచుకుని ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసుకోవాలి.
Advertisements
ఎల్ఆర్ఎస్ కు ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేయవచ్చు. లేదా మీ సేవా సెంటర్లు, సిటిజెన్ సర్వీస్ సెంటర్లలోనూ ఎల్ఆర్ఎస్ కు అప్లై చేయవచ్చు. https://lrsbrs.hmda.gov.in/hmdaLMS/loginpage అనే సైట్‌ను సందర్శించి అందులో వివరాలను నింపి ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేయవచ్చు. ఇక అప్లికేషన్ సబ్‌మిట్ చేశాక.. దాని స్టేటస్‌ను కూడా అందులోనే చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లో ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసే వారు ఫీజును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవచ్చు.
కాగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా సవరించిన 131 జీవో ప్రకారం ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
- ఒక చదరపు గజానికి మార్కెట్ విలువ రూ.3వేలు, అంత కన్నా తక్కువ ఉంటే 20 శాతం వరకు రెగ్యులరైజేషన్ చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది.
- రూ.3001 నుంచి రూ.5వేల మధ్య విలువ ఉంటే 30 శాతం చార్జిలు చెల్లించాలి.
- రూ.5001 నుంచి రూ.10వేల మధ్య విలువ ఉంటే 40 శాతం చార్జిలు చెల్లించాలి.
- రూ.10,001 నుంచి రూ.20వేల మధ్య విలువ అయితే 50 శాతం చార్జిలు చెల్లించాలి.
- రూ.20,001 నుంచి రూ.30వేల మధ్య విలువ అయితే 60 శాతం చార్జిలు వర్తిస్తాయి.
- రూ.30,001 నుంచి రూ.50వేల మధ్య విలువ ఉంటే 80 శాతం చార్జిలు చెల్లించాలి.
- ఒక చదరపు గజానికి మార్కెట్ విలువ రూ.50వేల కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు 100 శాతం వరకు రెగ్యులరైజేషన్ చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది.
Advertisements