Advertisement
టెక్నాలజీ వినియోగం పెరిగాక జనాలకు బాగా అవగాహన వచ్చింది. దీంతో నగదు కన్నా డిజిటల్ పేమెంట్లకే ఎక్కువ మంది ప్రాధాన్యతను ఇస్తున్నారు. చేతిలో నగదు లేకపోయినా సరే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, వెంటనే పేమెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు డిజిటల్ వాలెట్లు, యూపీఐ పేమెంట్ యాప్‌లు వచ్చాక డిజిటల్ పేమెంట్లు ఎక్కువయ్యాయి. దీంతోపాటు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లను కూడా జనాలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలోనే యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్.. ఇలా పలు రకాలుగా ఆన్‌లైన్‌లో నగదు పంపుకునే వెసులుబాటు కలిగింది. కానీ అంతా బాగానే ఉన్నా.. అవతలి వారికి నగదు పంపే విషయంలో వారి అకౌంట్ నంబర్ లేదా ఐఎఫ్ఎస్‌సీ లేదా యూపీఐ ఐడీలను తప్పుగా ఎంటర్ చేస్తే.. కొంప మునిగినట్లే అవుతోంది. డబ్బులు వేరే వాళ్లకు బదిలీ అవుతాయి. ఇలాంటి తప్పులు సహజంగానే జరుగుతుంటాయి. అయితే ఇలా పొరపాటున డబ్బులను వేరే వాళ్లకు పంపితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఆన్‌లైన్‌లో నగదును పొరపాటున వేరే వాళ్లకు పంపితే వెంటనే మీ బ్యాంక్ కు వెళ్లి విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేయాలి. అలాగే సదరు లావాదేవీకి సంబంధించిన రుజువులను బ్యాంకుకు సమర్పించాలి. మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో దానికి సంబంధించిన రశీదు ఉంటే అది లేదా స్క్రీన్ షాట్‌లను కూడా సబ్‌మిట్ చేయవచ్చు. దీంతో బ్యాంకు వారు వెరిఫై చేసి ప్రక్రియ ప్రారంభిస్తారు. తరువాత 7 నుంచి 10 రోజుల్లోగా ఆ మొత్తం మళ్లీ మీ అకౌంట్‌లో జమ అవుతుంది.
అదే మీరు నగదు పంపింది కూడా మీరు ఉపయోగించే బ్యాంకే అయితే నగదు వెంటనే మీ ఖాతాలో జమ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే బ్యాంక్ కనుక వారు వెంటనే సమస్యను పరిష్కరిస్తారు. ఇలా ఆన్‌లైన్‌లో పొరపాటున ఎవరికైనా డబ్బు పంపితే దాన్ని మళ్లీ పై విధంగా వెనక్కి తెచ్చుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే నగదు ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు అవతలి వ్యక్తికి చెందిన బ్యాంక్ అకౌంట్ వివరాలను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలి. చిన్న మొత్తం అయితే నష్టపోయినా, ఆ నగదు రాకున్నా పెద్దగా బాధ అనిపించదు. కానీ పెద్ద మొత్తంలో ఎవరికైనా పొరపాటున డబ్బు పంపితే అప్పుడు ఆ డబ్బు మళ్లీ వెనక్కి రావాలంటే ఎంతో ఆందోళన పడాల్సి ఉంటుంది. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆన్‌లైన్ నగదు ట్రాన్స్‌ఫర్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Advertisements