Advertisement
అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ.. నీతి నిజాయితీలతో బాధ్యతలు నిర్వర్తించే ఐపీఎస్ ఆఫీసర్లను మనం సినిమా తెరపైనే ఇప్పటి వరకు చూశాం. బయటి ప్రపంచంలోనూ ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొందరు ఉంటారు. వారిని మనం వేళ్లపై లెక్కబెట్టవచ్చు. అలాంటి ఆఫీసర్లలో చదలవాడ ఉమేష్ చంద్ర కూడా ఒకరు.
ఉమేష్ చంద్ర 29 మార్చి 1966లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా పెదపూడిలో జన్మించారు. హైదరాబాద్ బేగంపేటలో చదివారు. నిజాం కాలేజీ నుంచి 1987లో బీఏ, 1989లో ఎంఏ చదివి యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచారు. గోల్డ్ మెడల్ సాధించారు. 1991లో ఐపీఎస్ అయ్యారు. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రెయినింగ్ తీసుకున్నారు. అనంతరం ఆయన పోలీస్ అధికారిగా జనాలకు బాగా దగ్గరయ్యారు. జన జాగృతి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఎక్కువగా ఆయన ప్రజా సేవకే అంకితమయ్యారు.
ఆయనకు మొదటగా వరంగల్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పట్లో అక్కడ నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ ఆయన భయపడలేదు. ఏఎస్‌పీగా నక్సల్స్ ఏరివేత కొనసాగించారు. తరువాత 2000వ సంవత్సరంలో కడప జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ అప్పట్లో ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉండేది. దాన్ని ఆయన సమూలంగా నిర్మూలించారు. పేకాట క్లబ్బులు, ఇతర జూద కేంద్రాలను మూసివేయించారు. ఎన్నికలప్పుడు ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువగా జరుగుతుండేవి. వాటిని ఆయన జరగనీయకుండా చూశారు.
Advertisements
Advertisement
ఫ్యాక్షన్ గొడవల్లో ఎంతో మంది ప్రాణాలను ఆయన కాపాడారు. అందుకనే ఇప్పటికీ పులివెందులలో ఆయన ఫొటోలు పలువురి ఇండ్లలో ఉంటాయి. ఆయన్ను కొందరు ఇప్పటికీ దేవుడిలా పూజిస్తారంటే అతిశయోక్తి లేదు. తరువాత ఒకసారి కడపలో వరదలు వచ్చినప్పుడు ఆయన తన జీతాన్ని విరాళంగా ఇచ్చి.. ఇతర పోలీసు అధికారులతో కూడా ఆ పనిచేయించారు. ఎంతో మందిని ఆదుకున్నారు. అప్పట్లో ఆయన్ను కడప టైగర్ అని పిలిచేవారు.
కడప నుంచి ఆయనను కరీంనగర్‌కు బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన తన పనిని యథావిధిగా కొనసాగించారు. మళ్లీ నక్సల్స్ ఏరివేత మొదలు పెట్టారు. అప్పట్లో ఒక పోలీసు అధికారి ఉమేష్ చంద్ర గురించి చెబుతూ.. తాము 10 దశాబ్దాల్లో సాధించలేనిది ఉమేష్ కేవలం 10 నెలల్లోనే సాధించారని చెప్పారు. ఈ ఒక్క వాక్యం చాలు.. అప్పట్లో ఉమేష్ ఎంత సమర్థవంతంగా పనిచేశారో చెప్పడానికి.
Advertisements
తరువాత ఉమేష్‌ను 2001 సెప్టెంబర్ 4 న పలు కారణాల వల్ల విధుల నుంచి తొలగించారు. అనంతరం ఆయనను హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లో రోడ్డుపై కొందరు కాల్చి చంపారు. అక్కడే ప్రస్తుతం ఆయన విగ్రహం పెట్టారు. అప్పట్లో ఉమేష్ చంద్రకు ప్రజలు సన్మానాలు చేసేవారు. మహిళలు హారతులు ఇచ్చి మరీ ఆయనకు స్వాగతం పలికేవారు. అంతటి పేరును ఆయన పొందారు. ఆయన ధైర్య సాహసాలు, నీతి నిజాయితీ నేటి తరం పోలీసులకు ఆదర్శనీయం.