Advertisement
అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా ప్రధాని మోదీ రామ మందిర ఆలయ కాంప్లెక్స్‌లో పారిజాత మొక్కను నాటిన విషయం విదితమే. అయితే అప్పటి నుంచి పారిజాత వృక్షం పట్ల జనాలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే ఇంతకీ అసలు పారిజాత వృక్షం ప్రత్యేకత ఏమిటి ? దానికి జనాలు ఎందుకంత ప్రాధాన్యతను ఇస్తున్నారు ? అంటే…
పారిజాత వృక్షాన్ని కోరల్ జాస్మిన్ ట్రీ అని కూడా పిలుస్తారు. దీన్నే కల్పవృక్షం అని కూడా అంటారు. అంటే.. కోరిన కోర్కెలు నెరవేర్చు కల్పతరువు అన్నమాట. సత్యయుగంలో ఈ వృక్షం క్షీర సాగర మథనం జరిగినప్పుడు బయట పడింది. అప్పట్లో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మథించగా అనేక వస్తువులు బయటికి వస్తాయి. వాటిలో పారిజాత వృక్షం కూడా ఒకటి. దీన్ని అప్పటి నుంచి కల్పతరువు, కల్పవృక్షం అని పిలవడం మొదలుపెట్టారు.
Advertisement
కల్పవృక్షాన్ని ఇంద్రుడు స్వర్గానికి తీసుకెళ్లి తన అంతఃపురంలో నాటుతాడు. దాని పుష్ఫాలను తన భార్యకు బహుమతిగా ఇస్తాడు. ఇక శ్రీకృష్ణుడు తన భార్యలు రుక్మిణి, సత్యభామల కోరిక మేరకు పారిజాత పుష్పాలను తెచ్చి వారికి బహుమతులుగా ఇస్తాడు. తరువాత అర్జునుడు తన తల్లి కుంతి శివ పూజ కోసం పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తెచ్చి భూమిపై నాటుతాడు. అప్పటి నుంచి ఈ వృక్షం భూమిపై పెరగడం మొదలు పెట్టింది. ఇక ఒకప్పుడు కేవలం దేవతలకు మాత్రమే ఈ వృక్షం అందుబాటులో ఉండేది కనుక.. పారిజాత వృక్షాన్ని దేవతా వృక్షం అని కూడా పిలవడం మొదలు పెట్టారు.
Advertisements
Advertisements
సృష్టిలో ఏ మొక్క, వృక్షానికి చెందిన పూలైనా సరే కింద పడ్డాక వాటిని దైవ పూజకు ఉపయోగించరు. కానీ ఒక్క పారిజాత వృక్షం పూలను మాత్రమే కింద పడ్డాక కూడా దైవ పూజకు ఉపయోగిస్తారు. అంతటి ప్రాధాన్యతను ఇవి సంతరించుకున్నాయి. పారిజాత పుష్పాలు రాత్రి పూట పూసి ఉదయం వరకు వాటంతట అవే నేలపై పడిపోతాయి. ఈ పువ్వులకు అంతటి చరిత్ర, ప్రాధాన్యత ఉంది కనుకనే.. జనాలు ఇప్పుడు ఈ వృక్షం పట్ల తెగ ఆసక్తిని చూపిస్తున్నారు..!