Advertisement
అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పి అనేక మంది ఆయా దేశాలకు వెళ్తుంటారు. కొందరు శాశ్వతంగా అక్కడే నివాసం ఉంటారు. కొందరు కొన్నేళ్ల పాటు ఆ దేశాల్లో ఉండి బాగా డబ్బు సంపాదించి తిరిగి ఇండియాకు వస్తారు. అయితే దేశంలో చాలా మంది అమెరికా లాంటి దేశాలకు వెళ్లేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ తమిళనాడు వాసులు మాత్రం ఎక్కువగా సింగపూర్, మలేషియా దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. అవును.. ఇది నిజమే.. అయితే ఇందుకు గల కారణాలను పరిశీలిస్తే…
క్రీస్తు శకం 10, 11 శతాబ్దాలకు చెందిన తమిళ సాహిత్యంలోనే మలేషియా గురించిన వర్ణన ఉంది. అక్కడి కేదాహ్ అనే రాష్ట్రం గురించిన వివరాలను మనం అప్పటి తమిళ సాహిత్యంలో చూడవచ్చు. అప్పట్లో.. అంటే.. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో తమిళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు మలేషియా వెళ్లాడు. అందుకు చరిత్రలో తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. అందువల్ల అప్పట్లో తమిళులు మలేషియాతో ఎక్కువగా వర్తకం జరిపేవారు. ఈ క్రమంలో మలేషియాకు, తమిళనాడుకు మధ్య రాను రాను సత్సంబంధాలు ఏర్పడ్డాయి.
తరువాత బ్రిటిష్ వారి హయాంలో మలేషియాలో పనిచేసేందుకు అప్పట్లో పెద్ద ఎత్తున తమిళులు అక్కడికి వలస వెళ్లారు. వారు అక్కడే స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. శ్రీలంక తమిళలు అక్కడ ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేసేవారు. కానీ భారతీయ తమిళులను మాత్రం చిన్నచూపు చూసేవారు. వారు కార్మికులుగా పనిచేసేవారు. తరువాత సింగపూర్‌కు కూడా తమిళులు నెమ్మదిగా వలస వెళ్లడం ప్రారంభించారు. ఈ క్రమంలో తమిళ ప్రజలకు ఆ రెండు దేశాలు అంటే నమ్మకం కుదిరింది. అక్కడ పుష్కలమైన అవకాశాలు ఉండడంతోపాటు.. తమ వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారనే భావంతో తమిళులు అప్పటి నుంచి ఆ రెండు దేశాలకు ఎక్కువగా వలస వెళ్లడం ప్రారంభించారు.
Advertisement
అయితే కొందరు తమిళులు అప్పట్లో బర్మాకు భారీ ఎత్తున వలస వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ ఆర్మీ సియామ్ నుంచి బర్మాకు 415 కిలోమీటర్ల రైల్వే లైనును నిర్మించాలని నిర్ణయించింది. అందుకు గాను పనిచేసేందుకు కార్మికులు పెద్ద ఎత్తున అవసరం అయ్యారు. ఈ క్రమంలో అక్కడికి వలస వెళ్లిన అనేక మంది తమిళ కార్మికులు రైల్వే లైను నిర్మాణం పనులు చేసేవారు. సుమారుగా 1.20 లక్షల మంది తమిళలు ఆ పనుల్లో చేరగా.. వారిలో 60వేల మంది అక్కడే పలు కారణాల వల్ల చనిపోయారు.
Advertisements
జపాన్ సైనికులు తమిళ కార్మికులను తీవ్రంగా హింసించేవారు. రైలు లైను నిర్మాణం పనుల్లో అనేక మంది పాము కాట్లకు, పురుగులు కుట్టి, కలరా వంటి వ్యాధులు వచ్చి చనిపోయేవారు. కొందరు ఆ హింసకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే.. తమిళ మహిళలు, యువతులు జపాన్ సైనికులు తమపై చేసే అత్యాచారాలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు. ఈ క్రమంలో సగం మంది వరకు తమిళలు ఆ ప్రాజెక్టులోనే చనిపోయారు. అయినప్పటికీ బర్మాలో ఇప్పటికీ తమిళులు చాలా మంది స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఇక భారత్ చుట్టూ ఉన్న దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా తదితర దేశాల్లోనూ మొత్తం భారతీయుల్లో 90 శాతం వరకు తమిళులే ఉంటారు. అమెరికా వంటి దేశాలకు వారు ఎక్కువగా వెళ్లకపోవడానికి కారణం.. ఆయా దేశాల్లో ఉన్న తమిళుల సంఖ్యా బలమే అని మరొక కారణం కూడా చెప్పవచ్చు. అందుకనే అనేక మంది తమిళులు మనకు ఆసియా దేశాల్లో కనిపిస్తారు.
Advertisements