Advertisement
ఆలోచన అంటూ ఉండాలే గానీ ప్రస్తుత తరుణంలో స్వయం ఉపాధిని పొందేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిల్లో పుట్టగొడుగుల పెంపకం కూడా ఒకటి. ప్రస్తుతం అనేక మంది ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. కారణం.. తక్కువ స్థలంలోనే పుట్టగొడుగులను పెంచి అధిక ఆదాయం పొందవచ్చు. కొంత శ్రమ పడితే చాలు.. పుట్టగొడుగుల పెంపకం ద్వారా అద్భుతమైన లాభాలను సాధించవచ్చు. అవును.. సరిగ్గా ఆమె కూడా ఇలాగే చేస్తోంది.
గుజరాత్‌లోని తాపి జిల్లాకు చెందిన అంజనా గమిత్ అనే మహిళ సివిల్ ఇంజినీర్. కానీ ఉద్యోగం మానేసి పుట్టగొడుగుల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంది. అందుకు గాను ఆమె అక్కడి కృషి విజ్ఞాన్ కేంద్రలో 4 రోజుల పాటు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కూడా తీసుకుంది. దీంతో ఆమె గతేడాది పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఏకంగా రూ.2 లక్షల లాభం పొందింది.
అంజనా ముందుగా తన ఇంటి వద్ద ఉన్న 10×10 అడుగుల స్థలంలోని పార్కింగ్ షెడ్‌ను పుట్టగొడుగుల పెంపకానికి ఎంచుకుంది. దాని చుట్టూ గ్రీన్ షేడ్ నెట్‌ను ఏర్పాటు చేసింది. అనంతరం మొదట్లో 2 నెలల్లోనే 140 కిలోల పుట్టగొడుగులను పెంచింది. దాంతో ఆమెకు మొదటగా రూ.30వేల ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో ఆమె వెనుదిరిగి చూడలేదు. అప్పటి నుంచి ఆమె వాటి పెంపకాన్ని కొనసాగిస్తూ ఆదాయం ఆర్జిస్తోంది.
Advertisements
Advertisement
పుట్టగొడుగలు చేతికి వచ్చేందుకు కనీసం 25 రోజుల సమయం పడుతుంది. 10 కిలోల స్పాన్‌తో 45 కిలోల పుట్టగొడుగులు వస్తాయి. వీటిని పెంచే వాతావరణం తేమగా ఉండాలి. అలాగే ఎప్పుడు ఒకే ఉష్ణోగ్రత ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. దీంతో నాణ్యమైన పుట్టగొడుగులు వస్తాయి. అయితే పుట్టగొడుగులను సంరక్షించేందుకు వేప నూనె వాడవచ్చు. కాగా ప్రస్తుతం అంజనా తన పార్కింగ్ షెడ్‌ను 25×45 అడుగుల విస్తీర్ణానికి పెంచింది. ఈ క్రమంలో మొత్తం 350 కల్టివేషన్ బ్యాగ్‌లలో ఆమె పుట్టగొడుగులను పెంచుతోంది.
పుట్టగొడుగులను పెంచాలనుకునే వారు ఆరంభంలో కనీసం 10×10 అడుగుల విస్తీర్ణం ఉండే స్థలంలో వాటిని పెంచాలి. అలాగే రూ.400 కనీస పెట్టుబడి అవుతుంది. పుట్టగొడుగుల పెంపకానికి అవసరం అయ్యే పదార్థాలను నర్సరీలు లేదా హార్టికల్చర్ సెంటర్లలో కొనుగోలు చేయవచ్చు. ఒక కిలో పుట్టగొడుగులను పెంచేందుకు అరకిలో గడ్డి అవసరం అవుతుంది. అలాగే 50 గ్రాముల విత్తనాలు అవసరం అవుతాయి. నిత్యం 5 లీటర్ల నీటిని అందించాలి. అయితే పుట్టగొడుగులను పెంచే ప్రదేశంలో ఉష్ణోగ్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు థర్మామీటర్ ఉపయోగించవచ్చు. దీంతోపాటు ప్లాస్టిక్ బ్యాగ్‌లు, బకెట్ ఉండాలి. వీటితో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించవచ్చు.
Advertisements
ఇక అంజనా తన పుట్ట గొడుగులను అమ్మేందుకు స్థానిక అంగన్‌వాడీ వర్కర్లు, మహిళలు, కిరాణా షాపుల వారి సహాయం తీసుకుంటోంది. దీంతో వారికి కూడా కొంత కమిషన్ వస్తోంది. ఇలా అందరూ లాభపడుతున్నారు. అయితే పుట్టగొడుగులను పెంచాలంటే ఓపిక ఉండాలని, ఆరంభంలో కొన్ని సార్లు పుట్టగొడుగులు నాశనం అవ్వచ్చని, కానీ గట్టిగా ప్రయత్నిస్తే వాటితో చక్కని బిజినెస్ చేయవచ్చని.. అంజనా చెబుతోంది. మరి మీకు కూడా ఈ వ్యాపారంపై ఆసక్తి ఉంటే వెంటనే చిన్నగా మొదలు పెట్టేయండి మరి..!