Advertisement
పండుగలు వస్తున్నాయంటే చాలు చాలా మంది ఇళ్లను శుభ్రం చేసుకుంటుంటారు. ఇంట్లో ఉన్న దుమ్ము, ధూళి, బూజు దులిపి చెత్తను బయట పారేస్తారు. అలాగే ఆ మహిళ కూడా చెత్తను బయట పారేసింది. ఆ చెత్తతోపాటు పనికిరాదనుకున్న ఓ బ్యాగును అందులో వేసింది. అయితే కొంత సేపటికి అసలు విషయం తెలిసి షాక్ కు గురైంది. కానీ చివరకు కథ సుఖాంతం అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
పూణె నగరంలో నివాసం ఉండే రేఖా సెలూకర్ అనే మహిళ దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేసింది. ఇంట్లో ఓ మూలన పాత బ్యాగు ఆమెకు దొరికింది. అది పాతది కదా, పాడైంది కాబట్టి అవసరం లేదని చెప్పి చెత్తతోపాటు పారేసింది. కానీ కొంత సేపటికి ఆమెకు బల్బు వెలిగింది. అందులో రూ.3 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఆమె షాకైనా వెంటనే తేరుకుని మున్సిపల్ డంప్ యార్డుకు వెళ్లింది.
Advertisement
అక్కడ ఆమె మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందిని కలిసి తన బ్యాగును పొరపాటున చెత్తలో వేశానని, అందులో విలువైన ఆభరణాలు ఉన్నాయని, ఎలాగైనా సరే ఆ బ్యాగును వెతికి పెట్టాలని కోరింది. దీంతో వారు కష్టపడి 18 టన్నుల చెత్తను క్షుణ్ణంగా గాలించారు. సుమారుగా 40 నిమిషాల తరువాత చెత్తలో ఆమె బ్యాగు లభించింది. దీంతో ఆ బ్యాగును తీసి ఆమె చూసుకుని అందులో ఆభరణాలు అలాగే ఉన్నట్లు గుర్తించి.. హమ్మయ్య.. అని ఫీలైంది. తన బ్యాగును తనకు వెతికి ఇచ్చినందుకు ఆమె మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. అవును మరి.. లక్ బాగుంది కాబట్టే చెత్తలో వేసినా బ్యాగ్ దొరికింది. అందులో ఆభరణాలూ అలాగే ఉన్నాయి. లేదంటే అనవసరంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది.
Advertisements