Advertisement
శివుడికి మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నాయి. మన దేశంలో పలు ప్రముఖమైన శివాలయాలు ఉన్నాయి. వాటిల్లో యాగంటి క్షేత్రం కూడా ఒకటి. ఈ క్షేత్రం పురాణకాలం నుంచి ఉందని భక్తులు విశ్వసిస్తారు. శివుడికి అపర భక్తుడిగా ఉన్న భృగు మహర్షి ఒకప్పుడు ఈ ప్రాంతంలో శివుడి కోసం తపస్సు చేయగా.. శివుడు పార్వతితో కలిసి ఇక్కడ వెలిశాడని ఒక కథ ప్రచారంలో ఉంది. అలాగే ఇంకో కథ కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది.
ఒకప్పుడు చిట్టెప్ప అనే శివభక్తుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేశాడట. ఈ క్రమంలో కొద్ది కాలం తరువాత అతనికి ఓ పెద్ద పులి ఆ ప్రాంతంలో కనిపించిందట. దీంతో ఆ పులినే అతను శివుడిగా భావించాడట. ఆ ఆనందంతో అతను నేకంటి నేకంటి అని కేకలు వేశాడట. దీంతో ఆ క్షేత్రం పేరు యాగంటిగా మారిందని భక్తులు చెబుతారు. ఎర్రమల కొండల్లో అత్యంత ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉండే వాతావరణంలో ఈ ఆలయం కొలువై ఉంటుంది.
Advertisement
ఈ ఆలయంలో నంది, శివపార్వతులు ఏక శిలపై కొలువై ఉంటారు. అలాంటి ప్రత్యేకత ఉన్న శైవ క్షేత్రం ఇదొక్కటే కావడం విశేషం. ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కలియుగాంతానికి చేసిన సూచన ఈ ఆలయంతో ముడిపడి ఉంది.
ఈ ఆలయంలో ఉన్న నంది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. 20 సంవత్సరాలకు ఒక సారి నంది విగ్రహం ఒక అంగుళం మేర పెరుగుతున్నట్లు గుర్తించారు. మొదట్లో నంది చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు స్థలం ఉండేది. కానీ నంది పెరుగుతుండడం వల్ల ఆ స్థలం తగ్గిపోయింది. దీంతో ప్రదక్షిణ చేసేందుకు వీలు లేకుండా పోయింది. అందుకు నంది పెరగడమే ప్రత్యక్ష ఉదాహరణ అని తెలుస్తుంది.
Advertisements
ఇక సాధారణంగా నంది కొమ్ముల్లో నుంచి చూస్తే శివలింగ దర్శనం అవుతుంది. కానీ ఇక్కడ శివపార్వతులు ఇద్దరూ కొలువై ఉండడంతో వారికి కాస్త చాటు కల్పించేందుకు నందిని ఈ ఆలయంలో ఈశాన్యంలో ఏర్పాటు చేశారని చెబుతారు. ఇక ఈ ఆలయంలో నంది కలియుగ అంతంలో లేచి రంకె వేస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు.
యాగంటి క్షేత్రంలో భక్తులు నిత్యం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు, శని, ఆది వారాల్లో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్వామి వారిని దర్శించుకోవచ్చు. భక్తులు ఇక్కడ ఉండేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదానం, బ్రాహ్మణి రెసిడెర్సీ, పలు వర్గాలకు చెందిన సత్రాలు ఉన్నాయి.
Advertisements